ఆఫ్ఘనిస్తాన్ అతలాకుతలం- మృతదేహాలు వెలికి తీస్తోండగానే..
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్.. అల్లకల్లోలానికి గురి అవుతోంది. ప్రకృతి వైపరీత్యాలకు అతలాకుతలమౌతోంది. మొన్నటికి మొన్న సంభవించిన భారీ భూకంపం నుంచి ఇంకా తేరుకోలేదు. భవనాలు, ఇతర కట్టడాల శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీస్తూనే ఉన్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య 4,000 దాటింది. ఎన్నో గృహాలు నేలమట్టం అయ్యాయి.
ఈ విపత్తు నుంచి కోలుకోకముందే మరోసారి పెను భూకంపం ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. హెరాత్ సిటీకి సమీపంలో ఈ తెల్లవారు జామున 6:11 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. దీని తీవ్రతను 6.3గా రికార్డ్ చేసింది జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్.

ఆఫ్ఘన్ వాయవ్య ప్రాంతంలో ఉంటుంది ఈ హెరాత్ సిటీ. ఇటీవలే ఇదే ప్రాంతాన్ని వణికించింది ఈ ప్రకృతి విపత్తు. వేలాదిమందిని పొట్టనబెట్టుకుంది. అదే స్థాయిలో జనం నిరాశ్రయులయ్యారు. పగబట్టిందా అన్నట్లు ఇప్పుడు అదే ప్రాంతాన్ని మళ్లీ అతలాకుతలం చేసింది తాజా భూకంపం.
భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఫలితంగా- స్థానికులెవ్వరూ తమ నివాసాల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. రోడ్ల మీదే గడుపుతున్నారు.
తాజాగా వణకించిన ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఏ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందనేది తెలియరావట్లేదు. కొన్ని చోట్ల నివాసాలు బీటలు వారినట్లు తెలుస్తోంది. మరి కొన్ని నేలమట్టం అయ్యాయని సమాచారం. దీనిపై పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తామని ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారి ముల్లా షేక్ చెప్పారు.












Click it and Unblock the Notifications