వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గానిస్తాన్: రెండు రోజుల్లో తాలిబాన్ కొత్త ప్రభుత్వం, చుట్టూ సవాళ్లే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అఫ్గానిస్తాన్ చరిత్రలో కీలక తేదీలలో 2021 ఆగస్టు 31 కూడా ఒకటి.

అమెరికా ఒకవైపు అఫ్గానిస్తాన్ నుంచి తమ సైనికులను, పౌరులను తరలించాలనే డెడ్‌లైన్‌కు కట్టుబడితే, మరోవైపు అదే రోజు అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నం వేగవంతమైంది.

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం తాలిబాన్ 'టాప్ లీడర్‌షిప్ కౌన్సిల్' మూడు రోజుల పాటు సమావేశమైంది. తాలిబాన్ నేత హీబాతుల్లా అఖుంద్‌జాదా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ ఎమిరేట్ కొత్త ప్రభుత్వం బ్లూప్రింట్ మరో మూడు రోజుల్లో ప్రపంచం ముందుకు వస్తుందని తాలిబాన్ రాజకీయ కార్యాలయం ఉపాధ్యక్షుడు షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ ప్రకటించారు.

ఆ కొత్త ప్రభుత్వం ఎలా ఉండబోతోంది. అందులో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది అప్పుడే పక్కాగా చెప్పలేకపోయినా.. ఆ కొత్త ప్రభుత్వం కచ్చితంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోబోతోందని నిపుణులు చెబుతున్నారు.

తాలిబాన్ ఆగస్టు 15న కాబుల్ మీద పట్టు సాధించి 15 రోజులైపోయింది. ప్రస్తుతం అక్కడ గట్టి పాలనా ఏర్పాట్లేవీ పునరుద్ధరించలేదు. బ్యాంకుల బయట పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి. నిత్యావసరాల కొరతతో జనం ఇబ్బందులు పడుతున్నారు.

ఏ ప్రభుత్వానికి అయినా ఇలాంటి పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. అందుకే తాలిబాన్ కూడా అఫ్గానిస్తాన్‌లో ఇలాంటి పరిస్థితులకు వీలైనంత త్వరగా తెర దించాలనే కోరుకుంటుంది.

తాలిబాన్ అంతర్గత గ్రూపిజం

కానీ అది ఎలా సాధ్యం. అది అంత సులభమా.. తెలుసుకోడానికి మాజీ దౌత్యవేత్తగా పనిచేసిన తల్మీజ్ అహ్మద్‌తో బీబీసీ మాట్లాడింది.

తాలిబాన్ ఎదుట ఉన్న సవాళ్లు రెండు రకాలని ఆయన చెప్పారు. మొదటి సవాలు ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే సమయంలో ఎదురైతే, రెండో సవాలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదలవుతుందన్నారు.

మొదటి సవాలు గురించి చెబుతూ... కొత్త ప్రభుత్వంలో తాలిబాన్ రాజకీయ గ్రూప్(దోహా గ్రూప్)కు ఎక్కువ అధికారం లభిస్తుందా, లేక పోరాడే మిలిటరీ గ్రూప్‌కు ఎక్కువ అధికారం లభిస్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం అన్నారు.

తాలిబాన్‌లో అంతర్గత విభేదాలు తక్కువేమీ లేవని నిపుణులు చెబుతున్నారు. తాలిబాన్ ఇప్పటివరకూ అమెరికాను అఫ్గానిస్తాన్ నుంచి తరిమికొట్టాలనే లక్ష్యంతో ఒక్కటిగా ఉండేవారు. కానీ, ఇప్పుడు మరోసారి వారు తమ లక్ష్యాన్ని సాధించారు కాబట్టి, వారి మధ్య ఉన్న గ్రూపిజం కూడా బయటపడుతుందని అంటున్నారు.

హీబాతుల్లా అఖుంద్‌జాదా ప్రస్తుతం తాలిబాన్ పొలిటికల్ లీడర్‌షిప్‌లో అత్యంత ముఖ్యమైన నేతగా ఉన్నారు.

"హిబాతుల్లా అఖుంద్‌జాదా ఇప్పటివరకూ తాలిబాన్ నంబర్ వన్ నేతగా ఉన్నారు. ఆయన నాయకత్వ పటిమ గురించి ప్రజలకు ఇంకా పెద్దగా తెలీదు. కొత్త ప్రభుత్వంలో ఆయనే అతిపెద్ద నేత అయితే, తాలిబాన్ ప్రభుత్వంలో పొలిటికల్ లీడర్‌షిప్ మాటకే ఎక్కువ విలువ ఉంటంది" అని తల్మీజ్ అహ్మద్ చెప్పారు.

హీబాతుల్లా అఖుంద్‌జాదాను తాలిబాన్ నంబర్ వన్ నేతగా ప్రకటిస్తే, ఆయనను కాంప్రమైజ్డ్ అభ్యర్థిగా చూస్తారు. మరోవైపు తాలిబాన్ మిలిటరీ నేతగా కమాండర్ సిరాజుద్దీన్ హక్కానీ ఉన్నారు. తాలిబాన్‌‌లలో ఆయనది నంబర్ టూ స్థానం. మిగతావారిని తమతో కలుపుకొని ముందుకు వెళ్లడం అనేదానిని ఆయన గ్రూప్ పెద్దగా నమ్మదు.

ఇప్పటివరకూ తాలిబాన్ సమయం మొత్తం పోరాటాలతోనే కొనసాగింది. అందుకే సిరాజుద్దీన్ హక్కానీకి ఎక్కువ బలం ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆయనకు కొత్త ప్రభుత్వంలో ఏ బాధ్యతలు ఇస్తారు, ఆయన ఎవరెవరిని తనతో కలుపుకొని ముందుకు నడుస్తారు అనేది తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బయటపడుతుంది.

తాలిబాన్ పాలన ఎలా ఉండబోతోంది

పాలనాపరమైన అనుభవం ఎలా వస్తుంది

అఫ్గానిస్తాన్‌లో 1996 నుంచి 2001 మధ్య తాలిబాన్ పాలన నడిచింది. ఆ సమయంలో తాము నడిపించబోయే ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి మోడల్‌నూ తాలిబాన్ ప్రపంచం ముందు ఉంచలేదు.

ఆ కాలాన్ని సంఘర్షణ స్థితిగా చెబుతారు తల్మీజ్ అహ్మద్. ఇప్పటి పరిస్థితి 90వ దశకం నాటి స్థితికి పూర్తిగా భిన్నమైనదని ఆయన భావిస్తున్నారు.

ప్రభుత్వం నడిపించడానికి తాలిబాన్‌‌లకు.. పాలనలో వారికి పరిజ్ఞానం ఉన్న నిపుణులు, అధికారులు, పాలనానుభవం ఉన్నవారు, చట్టం నియమ నిబంధనలు తెలిసినవారు అవసరం.

తాలిబాన్‌లలో ఇలాంటి ప్రావీణ్యం లేదు. అందుకే, వారు ఎవరి సాయం తీసుకుంటారు, అనుభవజ్ఞులను ఎక్కడ నుంచి తీసుకొస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబాన్ నేతలు గత ప్రభుత్వాలలో పనిచేసినవారిని సంప్రదిస్తున్నారు.

అంటే మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, అఫ్గానిస్తాన్ హయ్యర్ కన్సిలియేషన్ కౌన్సిల్ చీఫ్‌గా పనిచేసిన డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా, మాజీ ప్రధాని గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్, 2012లో తాలిబాన్‌తో శాంతి చర్చల ప్రతినిధి సలావుద్దీన్ రబ్బానీ లాంటి వారితో చర్చలు జరుపుతున్నారు.

కానీ, వీరిలో ఏ నేతలకు కొత్త ప్రభుత్వంలో ఎలాంటి స్థానం లభిస్తుంది, ప్రభుత్వంలో వారి మాటకు ఎంత విలువుంటుంది అనేది కూడా తాలిబాన్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది.

అంతర్జాతీయ ఆమోదం కోసం పోరాటం

ప్రపంచంలోని పెద్ద దేశాలు తమ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వాలని తాలిబాన్‌లు కోరుకుంటారని అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్ల గురించి బీబీసీతో మాట్లాడిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ డాక్టర్ స్వస్తి రావ్ చెప్పారు.

"చైనా, రష్యా, పాకిస్తాన్ లాంటి దేశాల వైపు నుంచి తాలిబాన్‌కు ఉత్సాహం కలిగించే ప్రకటనలు కచ్చితంగా వచ్చాయి. కానీ, అవేవీ ఇప్పటివరకూ వారికి గుర్తింపు ఇవ్వలేదు. చాలా దేశాలు వారి ప్రభుత్వం అసలు ఎలా ఉండబోతోందో చూడాలని వేచిచూస్తున్నాయి" అన్నారు.

"తాలిబాన్ కొత్త ప్రభుత్వానికి అంతర్జాతీయంగా ఆమోదం లభించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇప్పుడు ఆ దేశానికి విదేశీ నిధులు ఆగిపోయాయి. అఫ్గానిస్తాన్ ప్రభుత్వం 75 శాతం వ్యయం ఈ విదేశీ మద్దతు మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు అమెరికా, ఐఎంఎఫ్ నుంచి ఫండింగ్ ఆగిపోతే, వారు ప్రభుత్వం నడపడం కష్టం కావచ్చు" అని డాక్టర్ స్వస్తి రావ్ చెప్పారు.

స్వస్తి రావ్ మాటలనే తల్మీజ్ అహ్మద్ ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థకు అన్వయించారు.

"అఫ్గానిస్తాన్ జీడీపీలో సగ భాగం విదేశీ ఆర్థికసాయం ద్వారానే వస్తుంది. ఇప్పుడు వారికి విదేశీ సాయం పూర్తిగా ఆగిపోయింది. దీంతో, అక్కడ ఆర్థిక కార్యకలాపాలు ప్రస్తుతానికి స్తంభించాయి. చాలా మందికి జీతాలు కూడా అందడం లేదు. అక్కడక్కడా కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. అలాంటప్పుడు కొత్త ప్రభుత్వం మొదట ఆర్థికవ్యవస్థను పట్టాలెక్కించేలా వెంటనే ఏదైనా చేయడం, సాహసోపేత చర్యలు తీసుకోవడం చాలా అవసరం" అన్నారు.

తాలిబాన్ పాలన ఎలా ఉండబోతోంది

వ్యతిరేక గ్రూపులను ఎదుర్కోవడంలో సవాలు

అంతర్గత వివాదాలు, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన తర్వాత తాలిబాన్ ముందున్న మూడో సవాలు అఫ్గానిస్తాన్‌లోని వ్యతిరేక గ్రూపులను ఎదుర్కోవడం.

"నార్తర్న్ అలియన్స్ తాలిబాన్‌కు ఎప్పుడూ అంత తేలిగ్గా లొంగిపోలేదు. వారు ఇంతకు ముందు కూడా పంజ్‌షీర్‌ను ఆక్రమించుకోలేకపోయారు. అక్కడ తిరుగుబాటును పూర్తిగా అంతం చేయడం సాధ్య కాదు. అందుకే, చర్చల ద్వారా వారికి ఎలా ప్రభుత్వంలో స్థానం కల్పించాలి, వారి తిరుగుబాటు నుంచి ఎలా బయటపడాలి అనేదానిపై తాలిబాన్ దృష్టి పెడతారు" అని స్వస్తి రావ్ చెప్పారు.

వీటితోపాటు తాలిబాన్‌కు ఐసిస్-కే, అల్ ఖైదా లాంటి తీవ్రవాద సంస్థల నుంచి మరో రకమైన సవాలు ఎదురు కావచ్చు.

ఇటీవలి కాబుల్ పేలుళ్లలో ఐసిస్-కే హస్తం ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీనిని ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావిన్స్(ఐఎస్‌కేపీ) అంటారు. ఐసిస్-కే, తాలిబాన్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి.

తాలిబాన్ జిహాద్ వదిలిపెట్టి.. ఖతర్ రాజధాని దోహాలో ఖరీదైన హోటళ్లలో శాంతి ఒప్పందాన్ని ఎంచుకుందని ఐసిస్-కే ఆరోపిస్తోంది.

తాలిబాన్ పాలన ఎలా ఉండబోతోంది

సైన్యం, పోలీసుల అవసరం

అఫ్గానిస్తాన్‌లో సోవియట్ యూనియన్ అడుగుపెట్టినప్పటి నుంచి.. అంటే, గత 40 ఏళ్లుగా అక్కడ అంతర్యుద్ధం కొనసాగుతోంది. దాంతో అఫ్గానిస్తాన్‌లో ఒక మెరుగైన యూనిఫైడ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ ఏర్పాటు చేయలేకపోయారు. అమెరికా ఒకసారి ఆ ప్రయత్నం చేసినా, తాలిబాన్‌ను ఎదుర్కొన్న సమయంలో వారు ఎలాంటి బలం చూపించలేకపోయారు, ఆయుధాలు పడేసి పారిపోయారు.

ఇప్పుడు అఫ్గానిస్తాన్ కొత్త ప్రభుత్వం వీలైనంత త్వరగా క్రమశిక్షణతో, శక్తిమంతులైన ఒక సైన్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంటుంది. దేశ సరిహద్దులను సురక్షితం చేయడానికి అది అత్యంత కీలకం.

ముఖ్యంగా తమ భూభాగాన్ని ఏ దేశానికీ వ్యతిరేకంగా అంతర్జాతీయ ఉగ్రవాదానికి అడ్డా కానివ్వబోమని తాలిబాన్ ప్రపంచానికి హామీలు గుప్పిస్తున్న సమయంలో సైన్యం ఏర్పాటు చాలా అవసరం.

అలాగే, అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ పాలనలో సామాన్యులకు తగిన భద్రత కల్పించడానికి ఒక ప్రత్యేక పోలీస్ దళం కూడా అవసరం. అది దేశంలో పాలనా వ్యవస్థ సజావుగా సాగించడానికి సహకరిస్తుంది.

గత ప్రభుత్వంలో పోలీసు దళంలో ఉన్నవారు తాలిబాన్ కాబుల్‌ను ఆక్రమించుకోగానే మాయమైపోయారు. ఆ పాత పోలీసులు ఇప్పుడు తిరిగి వస్తారా, ఎలా వస్తారు, ఎప్పటిలోపు వస్తారు అనేది కూడా ముఖ్యమైన ప్రశ్నే.

ఇది కూడా తాలిబాన్‌కు ఒక సవాలు అని తల్మీజ్ అహ్మద్ భావిస్తున్నారు.

తాలిబాన్ పాలన ఎలా ఉండబోతోంది

ఐకమత్యం

వీటన్నిటితోపాటూ తాలిబాన్ కొత్త ప్రభుత్వం దేశంలో మెజారిటీ, మైనారిటీల మధ్య ఐకమత్యం ఉండేలా చూడడం కూడా చాలా అవసరమని నిపుణులిద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

తాలిబాన్‌, అఫ్గానిస్తాన్‌లో పష్తూన్ల జనాభా ఎక్కువ. దానితోపాటూ అక్కడ వివిధ మతాలు, సంప్రదాయాల వారు అంటే హజారా, షియా, ఉజ్బెక్, తాజిక్ కూడా ఉంటున్నారు. వీరి జనాభా కాస్త తక్కువ.

తాలిబాన్ గత పాలనలో మైనారిటీలపై జరిగిన ఎన్నో అకృత్యాల కథలు వినిపించాయి. ఈసారి అవి పునరావృతం కాకూడదు. దీనిపై అంతర్జాతీయ సమాజం కూడా ఒక కన్నేసి ఉంచుతుంది. కొత్త ప్రభుత్వం ఈ సవాళ్లన్నీ ఎలా ఎదుర్కొంటుందో నిశితంగా గమనిస్తుంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Afghanistan: Taliban new government in two days, challenges around
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X