ట్రంప్‌కు అమెజాన్,మైక్రోసాఫ్ట్ షాక్: ముస్లిం డేటాబేస్‌కు వ్యతిరేకంగా పిటిషన్!
ముస్లిం వలసదారుల డేటా బేస్ ను తయారు చేయాలన్న ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దీనికి సహకరించకూడదని ఆమెజాన్, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు.
హ్యూస్టన్: తొలినుంచి ముస్లిం వ్యతిరేకిగా ముద్రపడ్డ అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడిగా విజయం సాధించాక ముస్లిం వలసదారులపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముస్లిం వలసదారుల డేటా బేస్ ను తయారు చేసే పనిలో ట్రంప్ నిమగ్నమయ్యారు.
అయితే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఆయనకు సహకరించకూడదని నిర్ణయించారు. ఈ రెండు సంస్థలకు చెందిన ఇంజినీర్లు, డిజైనర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర ఉద్యోగులు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక ఆన్‌లైన్ పిటిషన్ పై సంతకాలను సేకరించే పనిలో పడ్డారు.

ముస్లింలపై వివక్షపూరిత వైఖరిని అవలంభిస్తోన్న ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ ఈ సంతకాల సేకరణ చేపట్టినట్టుగా సిలికాన్ వ్యాలీ ఉద్యోగులు చెబుతున్నారు. కాగా, ట్రంప్ కు వ్యతిరేకంగా రూపొందించిన ఆన్ లైన్ పిటిషన్ పై ఇప్పటిదాకా 1300 మంది సంతకాలు చేశారని సియాటిల్ టైమ్స్ వెల్లడించింది.
జాతి, మత, వర్గ ప్రాతిపదికన చేపట్టే ఏ డేటా బేస్ కి తాము సహకరించబోమని సిలికాన్ వ్యాలీ ఉద్యోగులు తెలిపారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్ మాత్రమే గాక గూగుల్, యాపిల్, ఐబీఎం, ఇతర టెక్నాలజీ సంస్థలకు చెందిన ఉద్యోగులు కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications