నాకు నోబెల్ కావాల్సిందే.. మారాం చేస్తున్న ట్రంప్!
భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా మానవ హక్కుల న్యాయకోవిదురాలు నవీ పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. ప్రపంచంలో ఎవరికీ తెలియని ఈ పురస్కారాన్ని ఇచ్చారని ట్రంప్ విమర్శించారు. తాను సాధించినదానితో పోలిస్తే తనకు ఒకటి కాదు.. ఏకంగా 8 నోబెల్ శాంతి బహుమతులు లభించి ఉండాల్సిందని డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్ చేశారు.
8 యుద్ధాలను పరిష్కారించానంటున్న ట్రంప్
తన హయాంలో 8 ప్రధాన అంతర్జాతీయ యుద్ధాలు, తీవ్రమైన సంఘర్షణలను పరిష్కరించానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వీటిలో కంబోడియా-థాయ్‌లాండ్, కొసావో-సెర్బియా, కాంగో-రువాండా, భారత్-పాకిస్తాన్, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్-ఇథియోపియా, అర్మేనియా-అజర్‌బైజాన్, ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను తాను పరిష్కరించినట్లు చెప్పుకొచ్చారు. ప్రత్యేకించి భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడమే తనకు నోబెల్ బహుమతి ఇవ్వడానికి తగిన అర్హత అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

నవీ పిళ్లైపై కామెంట్స్
నోబెల్ గ్రహీత నవీ పిళ్లై గురించి ఎవరికీ ఏమీ తెలియదని.. ఐక్యరాజ్యసమితిలో పనిచేసిన ఓ ఉదారవాదికి ఈ అవార్డు ఇచ్చారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆమె స్పష్టంగా ఇజ్రాయెల్ వ్యతిరేకి అని వ్యాఖ్యానించారు. తానే స్వయంగా హమాస్ చెరలో ఉన్న చివరి 28 మంది సజీవ బందీలతో సహా మిగిలిన వారందరినీ రక్షించి ఇజ్రాయెల్‌కు తిరిగి వచ్చానని.. ఆ ప్రాంతం నాశనం కాకుండా అడ్డుకున్నానని చెప్పారు.
ప్రపంచ శాంతి దూత నేనే..
చరిత్రలోనే మరెవరికన్నా తానే ఎక్కువ మంది ప్రాణాలను కాపాడానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు సాధించకుండా అడ్డుకోవడమే కాకుండా.. దక్షిణ కొరియా-ఉత్తర కొరియా, జపాన్-ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని చెప్పారు. వెనిజులాలో నికోలస్ మదురో పాలనకు చెక్ పెట్టి అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని.. అలాగే తూర్పు యూరప్ దేశాల నుంచి 900 మందికి పైగా రాజకీయ ఖైదీలను, ప్రపంచవ్యాప్తంగా 196 మంది బందీలను విడిపించానని పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి, నార్వేలపై విమర్శలు
నాటో దేశాలు తమ జీడీపీలో రక్షణ వ్యయాన్ని 2 శాతం నుంచి 5 శాతానికి పెంచేలా విజయం సాధించానని డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేశారు. ఎన్నో ప్రపంచ సమస్యలను పరిష్కరించిన తనకు కాకుండా ఎవరికీ తెలియని వ్యక్తికి అవార్డు ఇవ్వడం నార్వే నోబెల్ కమిటీ చరిత్రలో చెరిపివేయలేని మచ్చగా మిగిలిపోతుందని అన్నారు. తాను ప్రతినిధిగా ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే ఈ నోబెస్ శాంతి బహుమతి దక్కాల్సిందని ట్రంప్ అన్నారు.














Click it and Unblock the Notifications
