Cool drinks: పెప్సీ, కోకా-కోలాకు బ్యాడ్ టైమ్.. వరుస కేసులతో సతమతం.. డ్రింక్స్ తయారీపై కాదు
Coca Cola: కూల్ డ్రింక్స్ పేరిట ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థలు పెప్సీకో మరియు కోకా-కోలాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాటిపై అమెరికాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా.. పలు కేసులు సైతం నమోదయ్యాయి. అయితే ఇది వారు తయారుచేస్తున్న డ్రింక్స్ గురించి కాకపోవడం విశేషం.
బేవరేజెస్ తయారీదారులు పెప్సీకో మరియు కోకా-కోలాపై అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ కేసు నమోదు చేసింది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న కౌంటీలో ప్లాస్టిక్ బాటిళ్ల ద్వారా కాలుష్యానికి కారణమయ్యాయని ఆరోపించింది. వాటి ప్యాకేజింగ్ ద్వారా పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా, ఆ బాటిళ్ల రీసైక్లబిలిటీ గురించి ప్రజలను తప్పుదోవ పట్టించాయని ఆరోపించింది. ఈ మేరకు స్థానిక సుపీరియర్ కోర్టులో కేసు దాఖలు చేసింది.

కంపెనీలు తమ కంటైనర్లలోని ప్లాస్టిక్ అవసరమైన స్థాయిలో రీసైకిల్ చేయబడదని తెలిసినా అందుకు విరుద్ధంగా ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటి ఉత్పత్తుల వలన కలిగే పర్యావరణ హానిని అడ్డుకోవడం కష్టంగా ఉంటుందని ఈ కేసులో పేర్కొన్నారు. బాటిల్స్ ఎక్కువ కాలం డీ కంపోజ్ కాకుండా చెత్త రూపంలో భూమిలో ఉంటాయని, తద్వారా పర్యావరణ సమస్యలకు కారణమవుతాయని ఆరోపించారు.
ఈ కాలుష్యం ఒక ప్రజా సమస్యగా మారిందని, పెప్సీకో మరియు కోకా-కోలాపై అన్యాయమైన మరియు మోసపూరిత వ్యాపార పద్ధతుల నిర్వహణకుగాను జరిమానాలు విధించాలని లాస్ ఏంజిల్స్ కౌంటీ కోర్టును కోరింది. 'కోక్ మరియు పెప్సీ తమ మోసపూరిత ప్రచారాన్ని ఆపి, వారి ఉత్పత్తులు కలిగిస్తున్న ప్లాస్టిక్ కాలుష్య సమస్యలకు బాధ్యత వహించాలి' అని బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్స్ ఛైర్ లిండ్సే హార్వాత్ డిమాండ చేశారు. అయితే ఆయా కంపెనీలు దీనిపై స్పందించాల్సి ఉంది.
USలో ఈ తరహా కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. అక్కడి రాష్ట్రాలు మరియు స్థానిక ప్రభుత్వాలతో పాటు పర్యావరణ కార్యకర్తలు ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేసే సంస్థలపై కేసులు వేశాయి. న్యూయార్క్ అటార్నీ జనరల్ ఇటీవల పెప్సీపై, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ ఎక్సాన్ మొబైల్ పై లా సూట్ ఫైల్ చేశారు. ఎర్త్ ఐలాండ్ ఇన్స్టిట్యూట్ 2020లో వాషింగ్టన్ DC కోర్టులో కోకా-కోలాపై వేసిన కేసును తిరిగి ప్రారంభించింది.












Click it and Unblock the Notifications