రష్యా శరణు కోరిన ట్రంప్... రూల్స్ పక్కనపెట్టి ఆయిల్ అడుక్కున్న అధ్యక్షుడు
అమెరికా రాజకీయాల్లో అంతర్జాతీయ సంబంధాలు ఎప్పుడూ ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. కానీ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ దౌత్య రంగాన్నే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అన్న రూల్స్ పెడతారు కానీ ఫాలో అవ్వడు అని ఓ సినిమాలో ఉన్న డైలాగ్ ట్రంప్ కు పక్కాగా సరిపోయే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కేవలం మూడు వారాల క్రితమే రష్యా చమురుపై కొత్త ఆంక్షలు విధిస్తూ సంతకం చేసిన ట్రంప్, ఇప్పుడు అదే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి లక్షలాది టన్నుల డీజిల్‌ను దిగుమతి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, వచ్చే మధ్యంతర ఎన్నికల్లో ఎదురయ్యే ఘోర పరాజయాన్ని తట్టుకునేందుకు ట్రంప్ రష్యాతో సంచలన ఇంధన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
ఆకాశాన్నంటిన డీజిల్ ధరలు: వ్యవసాయ రాష్ట్రాల్లో చెలరేగిన ఆగ్రహం
అమెరికాలో లీటరు డీజిల్ ధర పెరిగితే.. దాని ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ముఖ్యంగా వ్యవసాయం, రవాణా రంగాలపై ఆధారపడే ఐయోవా, కాన్సాస్, టెక్సాస్, ఒహియో వంటి కీలక రాష్ట్రాల్లో డీజిల్ కొరత, ధరల భారం రైతులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు నడపడం, పంటలను మార్కెట్‌కు తరలించడం రైతులకు తలకు మించిన భారంగా మారింది. ఈ రాష్ట్రాలే కాంగ్రెస్ నిలబెట్టుకోవడానికి రిపబ్లికన్లకు అత్యంత కీలకమైన రాజకీయ వేదికలు. పంప్ వద్ద పెరుగుతున్న లీటర్ ధరలు, దానికి తోడు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం ట్రంప్ ప్రజాదరణను దారుణంగా దిగజార్చాయి.

శత్రుదేశంతో చేతులు కలిపిన అధ్యక్షుడు
ఎన్నికల సమయంలో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు ట్రంప్ అన్ని మార్గాలనూ అన్వేషించారు. యూరోపియన్ మిత్రదేశాలపై ఒత్తిడి తెచ్చి చమురు నిల్వలను బయటకు తీయించడం, ఫెడరల్ పన్నులను మినహాయించడం, వ్యవసాయ డీజిల్‌ను ట్రక్కులకు ఉపయోగించడానికి అనుమతించడం వంటి అనేక చర్యలు చేపట్టారు. చివరికి ఇరాన్‌పై దాడులను ఎన్నికలయ్యే వరకు నిలిపివేస్తామని కూడా బాహాటంగా ప్రకటించారు. కానీ, ఏ ప్రయత్నమూ ఫలించకపోవడంతో, చివరి ఆయుధంగా పుతిన్‌తో చేతులు కలిపారు. రాబోయే నెలల్లో అమెరికా, అంతర్జాతీయ మార్కెట్లకు వందలాది టన్నుల డీజిల్‌ను రష్యా సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు.
మండిపడుతున్న మిత్రదేశాలు: పుతిన్ హత్యాకాండకు ట్రంప్ బహుమతి?
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును రష్యా యుద్ధ రంగానికి చేరవేస్తున్నారని యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా సొంత నాయకులు విమర్శిస్తున్నారు. ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఇచ్చిన అతిపెద్ద "బహుమతి" అని, దీనికి ప్రతిఫలంగా రష్యా మరింత భీకర భయోత్పాతాన్ని చెల్లిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. రష్యా ఇంధనాన్ని కొనడం అంటే వారు చేస్తున్న యుద్ధానికి పెట్టుబడి పెట్టడమేనని స్పష్టం చేశారు.
ఓటర్లను ట్రంప్ నిర్ణయం మెప్పిస్తుందా?
అమెరికా రోజుకు దాదాపు 3.6 మిలియన్ బారెళ్ల డీజిల్‌ను ఉపయోగిస్తుంది. రష్యా సరఫరా చేస్తామన్న 300,000 టన్నుల డీజిల్ అమెరికా ఒక రోజు వినియోగంలో సగానికి మాత్రమే సమానం. కాబట్టి ఈ ఒప్పందం వల్ల వెంటనే మార్కెట్‌లో ధరలు తగ్గిపోతాయని నిపుణులు భావించడం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్ ప్రారంభమైంది. రాబోయే ఎన్నికల్లో ఓటర్లు ఈ నిర్ణయాన్ని ఎలా స్వీకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రష్యాతో కుదుర్చుకున్న ఈ వివాదాస్పద ఒప్పందం అమెరికన్లకు నిజంగా ఉపశమనం కలిగిస్తుందో లేక ట్రంప్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుందో వేచి చూడాలి.














Click it and Unblock the Notifications
