న్యూజిలాండ్‌లో భారీ భూకంపం -రిక్టార్‌పై 7.3 తీవ్రత -సునామీ హెచ్చరిక జారీ -టెన్షన్, అప్రమత్తత
పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశం న్యూజిలాండ్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.3గా నమోదయ్యింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించగా.. దాని ధాటికి సునామీ కూడా పోటెత్తబోతోందనే హెచ్చరికలు జారీ అయ్యాయి..
న్యూజిలాండ్ ఉత్తర భాగంలోని గిస్బోర్న్ సిటీ తీరానికి 178 కిలోమీటర్ల దూరంలో.. సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీనీ ప్రభావంతో సునామి వచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం (పీటీడబ్ల్యూసీ) ఒక ప్రకటన చేసింది. భూకంపం తీవ్రతకు గిస్బోర్న్ సిటీలోనూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది.

భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ తరంగాలు ఏర్పడే అవకాశం ఉందని పీటీడబ్ల్యూసీ హెచ్చరించడంతో న్యూజిలాండ్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 2011లో క్రైస్ట్ చర్చ్ సిటీకి సమీపంగా 6.3 తీవ్రతతతో భూకంపం సంభవించి, ఆ తర్వాత సునామీ చెలరేగడం, నాటి విపత్తులో 185 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.












Click it and Unblock the Notifications