"10 మిసైళ్లతో భారత్ లోని ఆ డ్యామ్ ను కూల్చేస్తాం".. అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు
భారత్ పై అమెరికా సుంకాలు విధించిన క్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించారు. రెండు నెలల వ్యవధిలోనే ఆయన అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ ఏర్పాటు చేసిన విందులో అసిమ్ మునీర్ పాల్గొన్నారు. ఆ తర్వాత తాజాగా మరోసారి అమెరికాలో పర్యటించారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా పదవీవిరమణ కార్యక్రమంలో మునీర్ పాల్గొన్నారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో ఏర్పాటు చేసిన బ్లాక్ టై డిన్నర్ లో అసిమ్ మునీర్ పాల్గొన్నారు. భారత్ తో భవిష్యత్తులో మీకు యుద్ధం ముప్పు పొంచి ఉందా..? అని ఓ వార్తా సంస్థ ప్రశ్నించగా.. తమకు భారత్ నే కాదు.. సగం ప్రపంచాన్ని ధ్వంసం చేసే శక్తి ఉందని అన్నారు. అలాగే పాకిస్థాన్ కు నీరు వెళ్లకుండా సింధూ నది జలాలను భారత్ నిలిపివేయడంపై అసిమ్ మునీర్ మండిపడ్డారు. సింధూ నదిపై భారత్ కొత్తగా ఓ డ్యామ్ కడుతోందని.. ఆ డ్యామ్ పూర్తయ్యేంత వరకు వేచి చూస్తామని.. పూర్తయ్యాక 10 మిసైల్స్ తో దాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు.
1/5: Speaking at a black-tie dinner hosted for him in Tampa, Florida, Pakistan army chief Field Marshal Asim Munir on Saturday said should his country face an existential threat in a future war with India, 'we’ll take half the world down with us'
— ThePrintIndia (@ThePrintIndia) August 10, 2025
ఆపరేషన్ సింధూర్ నాలుగు రోజుల పాటు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో పాకిస్థాన్ కోల్పోయిన నష్టాల్ని తాము ప్రజల ముందు బహిర్గతం చేశామని.. ప్రపంచం ముందు వెల్లడించామన్నారు. కానీ భారత్ కూడా తమకంటే భారీగా నష్టపోయిందని.. కానీ ఆ దేశ ప్రజల ముందు దాన్ని బహిర్గతం చేయలేదని.. రాజకీయ అంశాలతో ఇలా చేశారని మండిపడ్డారు మునీర్. అలాగే పాకిస్థాన్ రాజకీయాల్లోకి మిలిటరీ ప్రమోయం ఉందా అన్న ప్రశ్నకు రాజకీయాలను కూడా రాజకీయ నాయకులకే వదిలేయాలని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రమూకలు జరిపిన దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్ , పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో వందల మంది ఉగ్రవాదులు హతం అయినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది. అలాగే పాకిస్థాన్ పై కఠిన ఆంక్షలు అమలు చేసింది. సింధూ నది జలాల పంపిణీని నిలిపివేసింది.












Click it and Unblock the Notifications