మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు: ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలోని ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇటీవల జరిగిన కాల్పుల ఘటనల్లో పదుల సంఖ్యలో మృతి చెందగా.. తాజాగా, మరో ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
ప్రధాన క్యాంపస్‌లోకి ప్రవేశించిన దుండగుడు అక్కడున్నవారిపై కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దుండగుడు మిచిగాన్ యూనివర్సిటీలోకి చొరబడి రెండు భవనాల వద్ద కాల్పులకు తెగబడ్డాడు. దీంతో భయాందోళనలకు గురైన విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. గదుల్లోకి వెళ్లిదాక్కున్నారు.

కాల్పుల అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని, పది మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
కాగా, అమెరికాలోని అతిపెద్ద యూనివర్సిటీల్లో మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ఒకటి. ఇక్కడ సుమారు 50 వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో 48 గంటలపాటు వర్సిటీ క్యాంపస్ లో అన్ని తరగతులు, ఇతర కార్యకలాపాలు రద్దు చేసినట్లు యూనివర్సిటీ పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవల కాలంలో తరచూ కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండటం ఆందోళనకరంగా మారింది.












Click it and Unblock the Notifications