అమెరికన్ 'బ్లాక్' ఉద్యమానికి ఊహించని స్పందన.. ఆ సైట్‌పై సర్వత్రా ప్రశంసలు..
జాత్యహంకారానికి బలైన ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత అమెరికా ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు,అన్ని రంగాల కార్పోరేట్లు 'బ్లాక్' ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. అమెరికా చరిత్రలో మార్టిన్ లూథర్ కింగ్,మాల్కమ్ ఎక్స్ వంటి నాయకుల సారథ్యంలో జరిగిన 'బ్లాక్' మూవ్‌మెంట్ తర్వాత.. మరోసారి ఆ స్థాయిని తలపించేలా ఇప్పుడు ఉద్యమం ఉధృతమవుతోంది. ఆఫ్రికన్ అమెరికన్లు చేస్తున్న ఈ ఉద్యమానికి తాజాగా ఓ ప్రముఖ వెబ్ సైట్ భిన్నమైన శైలిలో తన మద్దతును ప్రకటించింది.

బేబీ నేమ్స్ సైట్ మద్దతు..
BabyNames.com అనే ప్రముఖ వెబ్ సైట్ ఒకటి అమెరికన్ బ్లాక్ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. సాధారణంగా ఈ సైట్‌లో చిన్న పిల్లలకు సంబంధించిన పేర్లు ఉంటాయి. కొత్తగా పిల్లలు పుట్టిన తల్లిదండ్రులు.. తమ పాప లేదా బాబుకు పేరు పెట్టేందుకు ఈ సైట్‌లో బోలెడు పేర్లు అందుబాటులో ఉంటాయి. తాజాగా ఈ సైట్ అమెరికాలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా.. 'ఎరిక్,మైఖెల్,తమీర్,ఫిలండో,బ్రియోన్నా,జార్జ్ ఫ్లాయిడ్..' సహా కొన్ని వందల పేర్లను తమ హోమ్ పేజీలో డిస్‌ప్లే చేసింది. అక్కడ పేర్కొన్న వ్యక్తులంతా జాత్యహంకారానికి బలైనవారే. వీరిలో ఎక్కువమంది పోలీసుల చేతిలో బలైనవారే కాగా... మరికొందరు సాధారణ శ్వేత జాతి పౌరుల చేతిలో ప్రాణాలు కోల్పోయినవారు.
Recommended Video

ఊహించని స్పందన..
హోమ్ పేజీలో ఆ పేర్లను ప్రచురించిన బేబీ నేమ్స్ సైట్.. 'వీరంతా ఎవరో ఒకరి పిల్లలే..' అని పేర్కొనడం గమనార్హం. నిజానికి ఈ స్పందనను అమెరికన్ సమాజం ఊహించలేదు. కార్పోరేట్లన్నీ బ్లాక్ ఉద్యమానికి మద్దతు పలుకుతున్న తరుణంలో బేబీ నేమ్స్ సైట్ కూడా గొప్పగా మద్దతును తెలపడం చాలామందిని ఆశ్చర్యానికి,ఆనందానికి గురిచేసింది. అమెజాన్,నెట్‌ఫ్లిక్స్,నైక్ తదితర కార్పోరేట్ కంపెనీలు ఇప్పటికే బ్లాక్ ఉద్యమానికి మద్దతు పలికాయి.
నెటిజన్స్ ప్రశంసలు..
బేబీ నేమ్స్ సైట్ బ్లాక్ ఉద్యమానికి మద్దతు పలికిన తీరుపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 'మీరు పిల్లల్ని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో కనీసం నేనెప్పుడూ ఊహించలేదు.జాత్యహంకారానికి బలైన ఇంతమంది పేర్లను పంచుకుని బ్లాక్ ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు బేబీ నేమ్స్ సైట్‌కి ధన్యవాదాలు' అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. మరో నెటిజన్.. ' సుదీర్ఘమైన స్టేట్‌మెంట్స్ కంటే ఇలాంటి పదునైన ఆలోచనతో బ్లాక్ ఉద్యమానికి సహానుభూతిని,మద్దతును ప్రకటించడం బాగుంది. ఈ ఆలోచన చేసినవారు కచ్చితంగా అవార్డుకు అర్హులు.' అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications