బంగ్లాదేశ్ తలరాతను మార్చే ఎన్నికలు- ముమ్మరంగా పోలింగ్
దాదాపు రెండేళ్లుగా హింసాత్మక పరిస్థితులు, హిందువులపై దాడులతో అట్టుడుకు వస్తోన్న బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ ఇది. 2024 ఆగస్టులో విద్యార్థుల ఆందోళన, అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా ఉద్వాసన, 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికిన తర్వాత జరుగుతున్న మొట్ట మొదటి సాధారణ ఎన్నికలు ఇవి.
దేశవ్యాప్తంగా 42,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12.7 కోట్లమందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఈ ఎన్నికలతో- నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని 18 నెలల తాత్కాలిక ప్రభుత్వానికీ తెరపడనుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇక అక్కడ ఏర్పడబోతోంది. ఈ ఎన్నికల ఫలితాలు.. ఆ దేశ భవిష్యత్తును నిర్ధారించనున్నాయి.

ఈ ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్ రాజకీయ వాతావరణం పూర్తిగా మారింది. గత ఎన్నికల్లో ఆధిపత్యం వహించిన షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్‌ను ఈసారి నిషేధించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయలేదు. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), జమాతే ఇస్లామీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దీంతో పాటు 2024 ఆగస్టు నాటి విద్యార్థుల ఆందోళన నుంచి ఉద్భవించిన యువ నేతృత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) కూటమి కూడా ఎన్నికల రణరంగంలో దిగింది.
హింస చెలరేగు అవకాశం ఉన్నందున లక్షలాదిమంది భద్రతా సిబ్బందిని మోహరింపజేశారు. ఈ ఎన్నికల్లో యువ ఓటర్ల ప్రభావం కీలకం మారుతుందనే అంచనాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో 18 నుంచి 37 ఏళ్ల మధ్య వారు మొత్తం ఓటర్లలో దాదాపు 44 శాతం మంది ఉన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో వారి ఓటింగ్ కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది.
300 మంది పార్లమెంటు సభ్యుల ఎంపికతో పాటు, ఓటర్లు దేశ పాలనా నిర్మాణం మార్చే లక్ష్యంతో ప్రతిపాదించిన "జూలై చార్టర్" రాజ్యాంగ సంస్కరణల ప్రజాభిప్రాయ సేకరణలోనూ పాల్గొంటున్నారు. తొలిసారిగా- ప్రవాసులు, స్వయంగా ఓటు వేయలేని వారికి పోస్టల్ బ్యాలెట్‌లు బంగ్లాదేశ్ లో అందుబాటులోకి వచ్చాయి. పోలింగ్ సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమౌతుంది. రాత్రికి తొలి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications