E-Visa: భారతీయులకు మరో యూరప్ దేశం బంపర్ ఆఫర్: ఈ కొత్త దేశం చూసేయండి!
యూరప్ అనగానే ప్రతీ ఒక్కరికీ ప్యారిస్, రోమ్ లేదా స్విట్జర్లాండ్ లొకేషన్లే గుర్తుకొస్తాయి. అయితే ఈసారి సరికొత్త అందాలను, చారిత్రక కట్టడాలను చూడాలనుకునే భారతీయ పర్యాటకులకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది. తూర్పు యూరప్‌లోని అందమైన దేశం 'బెలారస్' భారతీయులకు ఈ-వీసా (E-Visa) సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి మేరకు బెలారస్ మంత్రిమండలి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సరికొత్త విధానంతో ఎలాంటి కష్టాలు లేకుండా ఆన్‌లైన్‌లోనే సులువుగా వీసా పొంది యూరప్ పర్యటనకు వెళ్లవచ్చు.
నేరుగా విమాన సర్వీసులు.. సులువైన ప్రయాణం!
కేవలం ఈ-వీసా మాత్రమే కాకుండా భారతీయులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు బెలారస్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. తమ రాజధాని నగరం 'మిన్స్క్' నుంచి భారతదేశంలోని ముంబై, గోవాలకు నేరుగా డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ప్రణాళికలు వేస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, టూరిజంతో పాటు వ్యాపార నిమిత్తం వెళ్లేవారికి కూడా రాకపోకలు చాలా సులువు కానున్నాయి.

వ్యాపారాలు, పర్యాటకానికి సరికొత్త తలుపులు
ఈ-వీసా నిర్ణయం కేవలం పర్యాటక రంగానికే కాకుండా రెండు దేశాల మధ్య వ్యాపార బంధాలను, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని బెలారస్ ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఉన్న క్లిష్టమైన కాగితాల ప్రక్రియను తొలగించి, అప్లికేషన్ విధానాన్ని సరళతరం చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా చాలా తక్కువ సమయంలోనే అనుమతులు లభిస్తాయి.
హిస్టారికల్ వండర్స్.. సందర్శించాల్సిన ప్రధాన ప్రాంతాలు
యూరప్‌లో ఇంకా అంతగా వెలుగులోకి రాని ఈ అందమైన దేశంలో పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రదేశాలు ఉన్నాయి:
- మిన్స్క్ నగరం: బెలారస్ రాజధాని అయిన ఈ నగరంలో 'ఇండిపెండెన్స్ స్క్వేర్', 'విక్టరీ స్క్వేర్'తో పాటు విచిత్రమైన రేఖాగణిత నిర్మాణంతో ఉండే 'నేషనల్ లైబ్రరీ' ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
- మీర్ క్యాజిల్ (Mir Castle): యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన ఈ మధ్యయుగాల నాటి కోట గోథిక్, పునరుజ్జీవన శైలి నిర్మాణాలతో చూపరులను కట్టిపడేస్తుంది.
- నెస్విజ్ ప్యాలెస్ (Nesvizh Palace): సుందరమైన ఉద్యానవనాలు, చారిత్రక చర్చి కాంప్లెక్స్‌తో కూడిన ఈ రాజభవనం యునెస్కో జాబితాలో చోటు దక్కించుకుంది.
- బ్రెస్ట్ ఫోర్ట్రెస్: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచే ఈ 19వ శతాబ్దపు కోట చరిత్ర ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
- బ్రాస్లావ్ లేక్స్ నేషనల్ పార్క్: ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక స్వర్గధామం. వందలాది సరస్సులు, పచ్చని అడవులు, చిన్న చిన్న దీవులతో ఈ పార్క్ కంటికి విందునిస్తుంది.














Click it and Unblock the Notifications
