బెట్టింగ్ మార్కెట్స్ అంచనాలన్నీ ఆయన వైపే మొగ్గు... అమెరికా ఫలితంపై ఇవీ బెట్టింగ్ ట్రెండ్స్...
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం... డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష రేసులో ముందున్నారు. అయితే చాలాచోట్ల ఇంకా పూర్తిగా బ్యాలెట్స్‌ను లెక్కించకపోవడంతో... చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జో బైడెన్ లీడ్‌లో దూసుకెళ్తుండగా... బెట్టింగ్ మార్కెట్ మాత్రం ట్రంప్ గెలుపుపై ధీమాతో ఉండటం గమనార్హం. పలు బెట్టింగ్ ఏజెన్సీల్లో పందెం రాయుళ్లు ట్రంప్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్లు అంచనా వేయడం దీన్ని స్పష్టం చేస్తోంది.

బెట్‌ఫైర్ బెట్టింగ్ ట్రెండ్స్..
బ్రిటీష్ బెట్టింగ్ ఎక్స్‌చేంజ్ బెట్‌ఫైర్‌లో పందెం రాయుళ్లు డొనాల్డ్ ట్రంప్‌కు 60శాతం విజయావకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నిజానికి మంగళవారం(నవంబర్ 3) ఉదయం పోలింగ్ మొదలైన కొద్దిసేపటికి బైడెన్‌కు 61శాతం విజయావకాశం ఉన్నట్లు.. ట్రంప్‌కు కేవలం 39శాతం మాత్రమే విజయావకాశం ఉన్నట్లు అంచనా వేశారు. కానీ రాను రాను వాళ్లు అంచనాల్లో ట్రంప్ వైపు మొగ్గు పెరుగుతోంది. 'జో బైడెన్ కంటే ట్రంప్ స్వల్ప ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనే అధ్యక్ష రేసులో ముందున్నారు.' అని బెట్‌ఫైర్ బెట్టింగ్ ఏజెన్సీకి చెందిన సామ్ రోస్‌బటమ్ అనే వ్యక్తి తెలిపారు.

యూకె బెట్టింగ్ మార్కెట్ ట్రెండ్స్...
యూకెకి చెందిన బెట్టింగ్ మార్కెట్స్ కూడా ట్రంప్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నాయి. అధ్యక్ష రేసులో ట్రంప్‌కు 65శాతం విజయావకాశం ఉన్నట్లు అక్కడి పందెం రాయుళ్లు,బెట్టింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి అమెరికాలో పోలింగ్ మొదలైన కొద్దిసేపటికి యూకె బెట్టింగ్ మార్కెట్స్‌లోనూ ట్రంప్ విజయావకాశాలు కేవలం 39శాతం అని అంచనా వేశారు. కానీ అక్కడ కూడా క్రమంగా ఆ నంబర్ పెరుగుతూ వచ్చింది.

న్యూజిలాండ్ బెట్టింగ్ ట్రెండ్స్...
న్యూజిలాండ్‌కి చెందిన మరో బెట్టింగ్ ఏజెన్సీ కూడా ట్రంప్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. ట్రంప్‌కు 62శాతం విజయావకాశం ఉన్నట్లు పేర్కొంది. మొదట్లో న్యూజిలాండ్ బెట్టింగ్ ఏజెన్సీ కూడా ట్రంప్ విజయావకాశాలను 37శాతంగా అంచనా వేసింది. కానీ అనూహ్యంగా బెట్టింగ్ రాయుళ్లంతా ట్రంప్ వైపే మొగ్గుచూపడంతో.. ఆయనపై విజయావకాశాలపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన ట్రెండ్స్ ప్రకారం అధ్యక్ష ఎన్నిక హోరాహోరీగా నడుస్తోంది. మొదట్లో బైడెన్ కంటే చాలా వెనుకబడ్డ ట్రంప్ ఇప్పుడు వేగంగా పుంజుకున్నారు. దాదాపుగా బైడెన్ ఆధిక్యతకు సమీపంలోకి వచ్చారు. దీంతో అధ్యక్ష ఎన్నిక తుది ఫలితం ఎవరిని విజేతగా నిర్ణయిస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.












Click it and Unblock the Notifications