డొనాల్డ్ ట్రంప్‌కు షాక్, బెట్టింగ్ రాయుళ్లు హిల్లరీ వైపే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కనిపిస్తోంది. అధ్యక్ష పీఠం విషయంలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ కనిపిస్తోంది.
అయితే చాలామంది మాత్రం హిల్లరీ క్లింటనే అధ్యక్షురాలు అవుతారని విశ్వసిస్తున్నారు. సర్వేలలో తొలుత డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలతో వెనుకబడ్డారు. ఇటీవల తిరిగి పుంజుకున్నారు.

గత కొద్ది రోజుల్లో హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు 13 శాతం తగ్గిపోయినట్లు సర్వేలు వెల్లడించాయి. ఓ సర్వేలోగత వారం హిల్లరీ పైన 81 శాతం మంది విశ్వాసం ఉంచగా, ఇప్పుడు అధి 56 శాతానికి తగ్గింది. ట్రంప్ ఎన్నికవుతారనే వారి సంఖ్య 22 శాతం నుంచి 44 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ఇరువురి మధ్య కేవలం ఒక శాతం మాత్రమే తేడా కూడా కనిపించింది.
ఇదిలా ఉండగా నార్త్ కరోలినాలో హిల్లరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఫ్లోరిడాలో డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని ఓ వెబ్ సైట్లో పేర్కొన్నారు.
ఈ వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ రాయుళ్లు స్థానికంగా జరిగే ఎన్నికల మీద కూడా బెట్ చేయవచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్థిపై ఎక్కువ మంది గెలుస్తారని నమ్మకం ఉంచితే ఆ షేర్లు మరింత ధర పలుకుతాయి. అదే ఓడిపోతారని భావిస్తే షేర్ల విలువ పడిపోతుంది. ఇందులో క్లింటన్ ముందంజలో ఉన్నారు. బెట్టింగ్ రాయుళ్లు క్లింటన్ గెలుస్తారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications