బిగ్‌బ్యాంగ్: తొలినాటి విశ్వపదార్థం పునఃసృష్టి
జెనీవా: విశ్వం ఆవిర్భావానికి కారణమైన బిగ్ బ్యాంగ్ సంభవించిన మరుక్షణం ఉద్భవించిన ప్రైమార్డియల్ సూప్‌ను శాస్త్రవేత్తలు భూమి మీద పునఃసృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పార్టికల్ యాక్సిలరేటర్ అయిన బిగ్ బ్యాంగ్ యంత్రం (లార్జ్ హాడ్రన్ కొలైడర్)లో అణు కేంద్రకాలను అధిక శక్తితో ఢీ కొట్టించడం ద్వారా దీన్ని సాకారం చేశారు.
తొలి నాటి విశ్వం గుట్టు విప్పే దిశగా ఇదో కీలక ముందడుగు. బిగ్ బ్యాంగ్ చోటుచేసుకున్న తర్వాత సెకనులో బిలియన్ల వంతులో విశ్వమంతా అత్యంత ఉష్ణమయ, చిక్కటి ఆద్య పదార్థంతో నిండిపోయింది. ప్రాథమిక రేణువులు చాలావరకూ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా క్వార్క్‌లు, గ్లువాన్లు ఎక్కువగా ఉన్నాయి.

ఈ దశను క్వార్క్ - గ్లువాన్ ప్లాస్మాగా పేర్కొంటారు. జెనీవాలోని సెర్న్‌లో ఉన్న 27 కి.మీ. పొడవైన లార్జ్ హాడ్రన్ కొలైడర్‌లో దీన్ని పునఃసృష్టించారు. ఆ యంత్రంలోని ఆలిస్ ఎక్స్‌పెరిమెంట్ డిటెక్టర్‌లో ఇది వెలుగు చూసింది. రికార్డు స్థాయిలో 5.02 టెరా ఎలక్ట్రాన్ వోల్ట్‌ల (టిఈవి) మేర శక్తిని ఉపయోగించి రెండు గోళాకార అణు కేంద్రకాలను పరస్పరం ఢీ కొట్టించడం ద్వారా దీన్ని సాకారం చేశారు.












Click it and Unblock the Notifications