భారతీయ టెక్కీలపై పిడుగు: H-1B Visa Fee మళ్లీ భారీగా పెంపు
అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలుగనే భారతీయ ఐటీ నిపుణులు, టెక్కీలపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. కొత్త హెచ్-1బీ (H-1B) వీసాల ఫీజును భారీగా పెంచాలని ప్రతిపాదించారు. ఇప్పటికే ఈ వీసా ఫీజు లక్ష డాలర్లు ఉంటోంది. దీన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకున్నారు. నూతన ఫీజు మొత్తాన్ని కూడా ఖరారు చేశారు. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజా ప్రతిపాదనలను రూపొందించింది.
ఇకపై H1B వీసా ఫీజు 1,03,265 డాలర్లుగా ఉండబోతోంది. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు 86.80 లక్షల రూపాయలు. ఈ ఫీజు మొత్తాన్ని శాశ్వత ప్రాతిపదికన పెంచాలని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ను వైట్ హౌస్ కు అందజేసింది. ఈ నిర్ణయం.. అమెరికా కంపెనీల నియామక ఖర్చులను భారీగా పెంచడమే కాకుండా భారతీయ టెక్కీల అవకాశాలను తీవ్రంగా దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది.

సాధారణంగా అమెరికా జారీ చేసే H1-B వీసా ఫీజు గతంలో 2,000 డాలర్ల నుండి 5,000 డాలర్ల మధ్య మాత్రమే ఉండేది. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ ఫీజు మొత్తాన్ని ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెంచారు డొనాల్డ్ ట్రంప్. దీనిపై అమెరికాలోని పలు న్యాయస్థానాల్లో పిటీషన్లు దాఖలయ్యాయి. అయినప్పటికీ.. ట్రంప్ వెనక్కి తగ్గట్లేదనడానికి ఈ తాజా నిర్ణయమే నిదర్శనం. ఇకపై హెచ్ 1 బీ వీసా ఫీజు 1,03,265 డాలర్లుగా పెంచడానికి సంబంధించిన ప్రతిపాదనలపై 30 రోజుల ప్రజా అభిప్రాయ సేకరణ ప్రక్రియ చేపట్టింది.
ఈ గడువు ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త రుసుములను అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉంది. అమెరికా ప్రతి ఏటా 65,000 సాధారణ హెచ్-1బీ వీసాలు, ప్రొఫెషనల్ డిగ్రీలు ఉన్నవారికి మరో 20,000 వీసాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తోంది. ఈ వీసా పొందే వారిలో అత్యధికంగా భారతీయులే. 2025 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన మొత్తం హెచ్-1బీ వీసాలలో దాదాపు 70 శాతం భారతీయులకే దక్కాయి. ఆ తర్వాత స్థానం.. చైనాది.
ఇప్పటికే స్టూడెంట్ వీసాలపై అమెరికాలో ఉంటూ హెచ్-1బీ వీసాకు మారే వారికి, అలాగే ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తూ వీసాలను పొడిగించుకునే వారికి ఈ ఫీజు వర్తించదు. భారత్ వంటి ఇతర దేశాల నుండి నేరుగా టెక్కీలు, ఇతర నిపుణులను అమెరికాకు రప్పించుకోవాలనుకునే కంపెనీలకు ఈ ఫీజు వర్తిస్తుంది. తక్కువ వేతనాలకే లభించే విదేశీ ఉద్యోగులను నియమించుకుంటూ, స్థానిక అమెరికన్ల ఉపాధిని కంపెనీలు దెబ్బతీస్తున్నాయని, దీనిని అడ్డుకోవడానికే ఈ ఫీజులు పెంచుతున్నామని వైట్ హౌస్ చెబుతోంది.
తాజా ప్రతిపాదనల్లో మరో ఆందోళనకరమైన మరొక అంశం.. ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసా హోల్డర్లకు ఇప్పటివరకు వెసలుబాటుగా ఉంటూ వస్తోన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేయడం. ప్రస్తుతం అమెరికా చట్టాల ప్రకారం, ఏదైనా సంస్థ విదేశీ ఉద్యోగులను తొలగిస్తే.. వారు అమెరికాలో ఉంటూ మరో ఉద్యోగాన్ని వెదుక్కోవడానికి లేదా ప్రత్యామ్నాయ వీసా మార్గాలను అన్వేషించడానికి 60 రోజుల సమయం లభిస్తుంది. ఈ గ్రేస్ పీరియడ్ ను కూడా రద్దు చేయాలని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీస్ ప్రతిపాదించింది.















Click it and Unblock the Notifications