వైన్ ఇవ్వమంటే.. లిక్విడ్ డిటర్జెంట్: తాగి వ్యక్తి మృతి
మ్యాడ్రిడ్: ఇకపై రెస్టారెంట్లు, హోటళ్లలో తాగకూడదు, తినకూడదనే స్థాయికి వచ్చేస్తున్నారు ప్రజలు. ఎందుకంటే వాటిలో అందించే సేవలు అలా ఉంటున్నాయి మరి. ఇటీవలే ప్రఖ్యాతిగాంచిన ఆహార సంస్థ కెఎఫ్‌సిలో చికెన్ ఫ్రై ఆర్డర్ చేస్తే.. ఎలుక ఫ్రై అందించారు. ఇలాంటి ఘటనే స్పెయిన్‌లో చోటు చేసుకుంది.
తాజా ఘటనలో ఓ రెస్టారెంట్ తమ వద్దకు వచ్చిన వినియోగదారుడికి లిక్విడ్ డిటర్జెంట్ ఇచ్చింది. దీంతో పానీయం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి తీవ్ర కడుపు మంటతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
స్పానిష్ మీడియా కథనం ప్రకారం.. స్పెయిన్ తూర్పు కోస్తా ప్రాంతమైన బెనికార్లోలోని ఇసబెల్ డి విలెనా టౌన్ స్కేర్ వద్ద ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బార్‌కు వచ్చిన ఆడ్రూస్ లారెంటే అని వ్యక్తి వైట్ వైన్ కావాలని ఆర్డర్ చేశాడు.

కాగా, రెస్టారెంట్ సిబ్బంది రంగు, వాసన లేని డిటర్జెంట్ ద్రవాన్ని అతనికిచ్చింది. పెద్దగా గమనించకుండా తాగేసిన ఆండ్రూస్.. వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
గొతు, వాయునాళం, కడుపులో మంటతో ఆండ్రూస్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బార్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేయగా, అతడు బెయిల్‌పై బయటికి వచ్చాడు.
కాగా, ఖాళీ మందు సీసాలో ప్రమాదకరమైన డిటర్జెంట్ ద్రవాన్ని ఎవరో పోశారని.. అది గమనించని సిబ్బంది దాన్ని బాధితుడికి ఇచ్చారని రెస్టారెంట్ యాజమన్యం పోలీసులకు తెలిపింది.












Click it and Unblock the Notifications