నూతన పోప్‌గా రాబర్ట్ ప్రవోస్ట్.. అమెరికా నుంచి తొలి పోప్
నూతన పోప్ ఎవరా అన్న ప్రశ్నకు తెరపడింది. నూతన పోప్ గా అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రవోస్ట్ ఎన్నికయ్యారు. ఇకపై ఆయనను 'పోప్ లియో' అనే పేరుతో సంబోధించనున్నారు. శతాబ్దాలుగా సాగుతున్న ప్రక్రియను అనుసరిస్తూ మొత్తం 133 మంది కార్డినల్స్ అత్యంత రహస్యంగా సమావేశమై కొత్త పోప్ ఎంపిక ప్రక్రియను ముగించారు.
వాటికన్‌లోని ప్రసిద్ధ సిస్టిన్ చాపెల్ చర్చి పొగగొట్టం నుంచి తెల్లటి పొగ రావడంతో పోప్ ఎంపిక పూర్తి అయింది. అయితే అమెరికాకు చెందిన వ్యక్తి పోప్‌గా ఎన్నికవడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. ఇక నూతన పోప్ ఎంపిక తర్వాత సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

ఈ మేరకు అత్యున్నత కార్డినల్ నూతన పోప్ పేరు ప్రకటించారు. తొలుత నూతన పోప్ పుట్టిన పేరును లాటిన్‌లో చదివి.. ఆ తర్వాత 'పోప్ లియో' పేరును వెల్లడించారు. అనంతరం నూతన పోప్ తొలిసారి ప్రజలకు బహిరంగంగా కనిపించారు.
ఇక పోప్ ఫ్రాన్సిస్ (88) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఆయన.. ఏప్రిల్ 21న రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో ఫ్రాన్సిస్ కన్నుమూశారు. దీంతో కొత్త పోప్ ఎంపిక అనివార్యమైంది.












Click it and Unblock the Notifications