విదేశీ కంపెనీలపై జెండా ఎగరేస్తోన్న భారతీయులు- ఇక యూట్యూబ్ పగ్గాలు కూడా..!!
ప్రఖ్యాత వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత సీఈఓ సుసాన్ వోజ్‌క్కీ రాజీనామా చేశారు. ఆమె స్థానంలో భారత సంతతికి చెందిన అమెరికన్ నీల్ మోమన్ నియమితులయ్యారు.
వాషింగ్టన్: ప్రఖ్యాత వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి కాస్తా- భారతీయుడికి పట్టం కట్టాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్.. మొన్నటివరకు ట్విట్టర్- ఇవన్నీ భారతీయుల చేతుల్లో ఉన్నవే. వారి సారథ్యంలో కార్యకలాపాలు కొనసాగిస్తోన్నవే. ఇక తాజాగా యూట్యూబ్ పగ్గాలు కూడా భారతీయుడి చేతికే అందాయి.
యూట్యూబ్ లో ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తోన్న సుసాన్ వోజ్‌క్కీ తప్పుకొన్నారు. తన బాధ్యతల నుంచి ఆమె వైదొలిగారు. తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. కుటుంబ, ఆరోగ్య, వ్యక్తిగత కారణాలతో తాను యూట్యూబ్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి పదవికి రాజీనామా చేస్తోన్నట్లు ప్రకటించారు.

25 సంవత్సరాలుగా సుసాన్ యూట్యూబ్ లో పని చేస్తోన్నారు. గూగుల్ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, సెర్గె బ్రిన్ తో కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. గూగుల్ ను స్థాపించిన కొత్తలో కాలిఫోర్నియా మెన్లో పార్క్ లోని తన గ్యారేజ్ ను ల్యారీ పేజ్ కు అద్దెకు ఇచ్చారు. 1,700 డాలర్లను అద్దెగా తీసుకునేవారు. అప్పట్లో ఆమె ఇంటెల్ లో మార్కెటింగ్ విభాగంలో పని చేస్తుండేవారు. 1999లో గూగుల్ లో జాయిన్ అయ్యారు.

అనంతరం గూగుల్ లో చేరారు. యూట్యూబ్ ను డెవలప్ చేసిన తరువాత అందులో కొనసాగారు. 2014లో ఈ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అపాయింట్ అయ్యారు. తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని సుసాన్ వ్యాఖ్యానించారు. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ కారణాలతో 25 సంవత్సరాలుగా యూట్యూబ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని తెంచేసుకుంటున్నట్లు వివరించారు. సీఈఓగా వైదొలగినప్పటికీ.. యూట్యూబ్ టీమ్స్, కోచింగ్ మెంబర్స్, క్రియేటర్స్ తో తరచూ సంప్రదింపులు జరుపుతుంటానని పేర్కొన్నారు. తన రాజీనామాను ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ అంగీకరించారని చెప్పారు.

కాగా సుసాన్ స్థానంలో భారత సంతతికి చెందిన అమెరికన్ నీల్ మోహన్ యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నియమితులయ్యారు. ఫలితంగా గూగుల్, యూట్యూబ్.. రెండు కూడా భారతీయుల చేతికి వచ్చినట్టయింది. ప్రస్తుతం ఆయన యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా పని చేస్తోన్నారు. 2015లో నీల్ మోహన్ ఈ బాధ్యతలను స్వీకరించారు.
ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి 2008లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశారు. యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ షార్ట్స్ వంటి ప్రొడక్ట్స్.. ఆయన హయాంలోనే డెవలప్ అయ్యాయి. దీన్ని గ్లోబల్ ప్లాట్ ఫామ్ గా మార్చడంలో ఘన విజయం సాధించారు.












Click it and Unblock the Notifications