China News: ప్రజల్ని మోసం చేస్తున్న చైనా.. దీన్ని కూడా డ్యూప్లికేట్ చేయడంతో ఆగ్రహ జ్వాలలు
China Duplicates: పొరుగు దేశం చైనా అనగానే మొదటగా గుర్తొచ్చేవి నాసిరకం ఉత్పత్తులు. ఎటువంటి వస్తువునైనా డ్యూప్లికేట్ చేయగల సత్తా డ్రాగన్ సొంతం అని అంటుంటారు. ఆకాశంలోని చంద్రుడి దగ్గర నుంచి నిత్యం వినియోగించే ఫోన్ల వరకు దేన్నీ వదిలిపెట్టలేదన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల అక్కడ జంతు ప్రదర్శనశాలలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.
నకిలీ జంతువులతో చైనా తన ప్రజలను మభ్యపెడుతోందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. జంతుప్రదర్శనశాలలలో సందేహాస్పదంగా పాండాలను పోలి ఉండేలా పెయింట్ చేయబడిన కుక్కలు, అన్యదేశ పిల్లుల వంటి తోడేళ్లతో పాటు నకిలీ జంతువులను ప్రదర్శిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో విధమైన కుంభకోణం వెలుగుచూసింది. దీంతో జూ నిర్వహకులపై సందర్శకులు తీవ్రంగా మండిపడ్డారు.

షెన్‌జెన్‌లోని షియోమీషా సీ వరల్డ్‌లో ఓ ఘటన జరిగింది. ఇటీవలే అక్టోబర్ 1న ఐదేళ్ల పునర్నిర్మాణం తర్వాత తిరిగి సందర్శకుల కోసం ఇది తెరవబడింది. ఇక్కడి జెయింట్ షార్క్ ప్రదర్శన చుట్టూ ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంది. 60 అడుగుల పొడవు ఉండి, ప్రపంచంలోనే అతిపెద్ద చేపగా గుర్తించబడిన భారీ వేల్ షార్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సముద్ర జీవి నిజానికి రోబోటిక్ ప్రతిరూపమని సందర్శకులు గమనించడంతో ఆ ఉత్సాహం కాస్తా ఆవిరైంది.
అక్వేరియం గ్లాస్ గుండా తీసిన ఫొటోల ద్వారా మెకానికల్ షార్క్‌ను సందర్శకులు గుర్తించారు. మొండెంలో పలు విభాగాలు కనెక్ట్ అయ్యే చోట కనిపించిన ఖాళీలు.. తక్కువ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌ను పోలి ఉన్నట్లు కనుగొన్నారు. వారిలో చాలామంది అక్వేరియం మార్కెటింగ్ ద్వారా తప్పుదోవ పట్టించినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో చేసేది లేక Xiaomeisha సీ వరల్డ్ ప్రతినిధులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
నిజమైన వేల్ షార్క్‌లను పట్టుకోవడం మరియు వ్యాపారం చేయడం వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం నిషేధమని సదరు అక్వేరియం నిర్వహకులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వన్యప్రాణుల రక్షణ చట్టాలకు కట్టుబడి బహుళ-మిలియన్ యువాన్ రోబోటిక్ షార్క్ అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయడం తమ ఉద్దేశం కాదని, నిబంధనలకు అనుగుణంగా రోబోటిక్ షార్క్ ఒక సృజనాత్మక పరిష్కారమని నిర్వాహకులు వివిరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications