"K వీసా" అంటూ చైనా కొత్త ప్లాన్.. అమెరికా H-1B షాక్ కలిసొస్తుందా !!
యువ, ప్రతిభావంతులైన నిపుణులను ఆకర్షించే లక్ష్యంతో చైనా సరికొత్త "K వీసా" విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) రంగాలలోని ప్రతిభావంతులను తమ దేశానికి ఆహ్వానిస్తుంది. ఆగస్టులో ఆమోదం పొందిన ఈ వీసా అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానుంది.
అమెరికా H-1B వీసాకు చైనా వెర్షన్..
ప్రస్తుతం చాలా దేశాలు వర్క్ వీసా నిబంధనలను కఠినతరం చేస్తుంటే.. చైనా మాత్రం సరళమైన విధానాన్ని తీసుకురావడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. పరిశీలకులు దీన్ని అమెరికా H-1B వీసాకు చైనా ప్రత్యామ్నాయంగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఇటీవల H-1B దరఖాస్తులపై ఏటా $100,000 రుసుము విధించడంతో దక్షిణాసియా టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చైనా ప్రవేశపెట్టిన ఈ K వీసా ఒక ప్రత్యామ్నాయ గమ్యంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

"K వీసా" కు ఎవరు అర్హులు ?
- చైనా న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశీయ లేదా విదేశీ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి STEM రంగాలలో బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ అర్హత పొందిన వారు.
- బోధన లేదా పరిశోధనలో నిమగ్నమై ఉన్న యువ శాస్త్రవేత్తలు.
- స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ ప్రాజెక్టుల్లో పాల్గొంటున్న నిపుణులు.
అవసరమైన పత్రాలు..
- విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు.
- వృత్తిపరమైన లేదా పరిశోధనా అనుభవ రుజువులు.
- వ్యక్తిగత రికార్డులు, పాస్‌పోర్ట్ కాపీలు.
- ఇవన్నీ చైనా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు ద్వారా సమర్పించాలి. ( పూర్తి మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి)
ప్రత్యేక సౌకర్యాలు..
- సాధారణ వర్క్ వీసాలతో పోలిస్తే K వీసాకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
- బహుళ ప్రవేశాలు (Multiple entry).
- సుదీర్ఘ కాలపరిమితి మరియు పొడిగించిన బస అవకాశాలు.
- దేశీయ యజమాని ఆహ్వానం అవసరం లేకపోవడం.
- అధ్యయనం, పరిశోధన, సాంస్కృతిక మార్పిడులు, స్టార్టప్‌లు, వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనడం.
ఇక చైనా గత కొన్నేళ్లుగా తమ దేశంలోకి ప్రవేశ నిబంధనలను క్రమంగా సడలిస్తోంది. ఇప్పటికే వీసా రహిత ప్రవేశాన్ని విస్తరించింది. 55 దేశాల ప్రయాణికులకు 240 గంటల వీసా రహిత రవాణా అనుమతిస్తోంది. 75 దేశాలతో వీసా రహిత మినహాయింపు ఒప్పందాలు కుదుర్చుకుంది. 2025 మొదటి అర్ధభాగంలోనే 38.05 మిలియన్ విదేశీయులు చైనాకు వచ్చారు.
ఇది గత సంవత్సరంతో పోలిస్తే 30.2% పెరుగుదలగా చెబుతున్నారు. ఇప్పుడు కూడా అమెరికా H-1B ఫీజు పెంపు తర్వాత చాలా మంది దక్షిణాసియా నిపుణులు, ముఖ్యంగా భారతీయులు, అమెరికా వృత్తి అవకాశాలను పునఃపరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో చైనా కొత్త వీసా విధానం ఒక ప్రత్యామ్నాయ మార్గంగా నిలుస్తుంది.












Click it and Unblock the Notifications