
అమెరికా సహా పలు దేశాల్లో చైనా సీక్రెట్ పోలీస్ స్టేషన్‌లు, ఇక్కడ ఏం చేస్తారు?

అమెరికా, బ్రిటన్, కెనడా సహా పలు ప్రపంచ దేశాల్లో చైనా 'సీక్రెట్ పోలీస్ స్టేషన్ల’ను ఏర్పాటు చేసి నడుపుతోందని.. 'సేఫ్‌గార్డ్ డిఫెండర్స్’ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన నివేదిక ఆయా దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. విదేశాల్లోని చైనా జాతీయులకు దౌత్య సేవలు అందిస్తామని చెప్తున్న ఈ పోలీస్ స్టేషన్లను.. ఆయా దేశాల్లో చైనా అసమ్మతివాదుల గొంతు నొక్కటానికి ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు.స్పెయిన్ కేంద్రంగా పనిచేస్తున్న 'సేఫ్‌గార్డ్ డిఫెండర్స్’ సెప్టెంబర్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. చైనాకు చెందిన రెండు రాష్ట్రాల పోలీసు విభాగాలు.. ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాల్లోని 21 దేశాల్లో 54 'విదేశీ పోలీస్ సర్వీస్ స్టేషన్ల’ను ఏర్పాటు చేశాయి. వీటిలో అత్యధిక పోలీస్ స్టేషన్లు యూరప్‌లో ఉన్నాయని.. స్పెయిన్‌లో 9, ఇటలీలో 4, బ్రిటన్‌లోని లండన్‌లో 2, గ్లాస్గోలో 1 చొప్పున ఈ స్టేషన్లు ఉన్నాయని ఒక జాబితాను కూడా సేఫ్‌గార్డ్ డిఫెండర్స్ నివేదికలో ప్రచురించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో, కెనడాలోని టొరొంటో నగరంలోను ఇలాంటి పోలీస్ స్టేషన్లను తాము కనుగొన్నట్లు తెలిపింది. తమ నివేదికకు ఆధారాలుగా.. చైనా ప్రభుత్వ, పోలీసు విభాగాలు, అధికారులు చేసిన ప్రకటనలు, విడుదల చేసిన వివరాలను చూపుతోంది.
- హనీ ట్రాప్ అంటే ఏంటి... సెక్స్‌ను ఒక ఆయుధంగా ఎలా వాడతారు
- భారతదేశంలో ఎలాంటి రుజువులూ, గుర్తింపు లేని 'గూఢచారులు’
సీమాంతర నేరాల దర్యాప్తులో తోడ్పడటానికి, విదేశాల్లోని చైనా జాతీయులకు ఆయా దేశాల్లో డ్రైవింగ్ లైసెన్సులు రెన్యువల్ చేయించటం వంటి పాలనాపరమైన సేవలు, ఇతర దౌత్య సేవలు అందించటానికి చైనా ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు.
అయితే.. వాస్తవంలో ఆ పోలీస్ స్టేషన్లు 'మరింత దుష్ట లక్ష్యం’ కోసం కూడా పనిచేస్తున్నాయని సేఫ్‌గార్డ్ డిఫెండర్స్ అంటోంది. చైనా ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని స్వదేశానికి తిరిగి రావాలంటూ ఒత్తిడి చేసే 'ఆపరేషన్ల’ను అమలు చేస్తున్నాయని చెప్పింది.
ఈ రహస్య పోలీస్ స్టేషన్లను.. 'ఓవర్‌సీస్ పోలీస్ సర్వీస్ స్టేషన్లు’గాను, '110 ఓవర్‌సీస్’ పేరుతోను పిలుస్తున్నట్లు చెప్పింది. చైనాలో జాతీయ పోలీస్ ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ 110.
విదేశాల్లో రహస్య పోలీస్ స్టేషన్లను నడుపుతున్నామన్న వాదనను చైనా నిరాకరించింది. చైనా పోలీస్ స్టేషన్లు అని వర్ణిస్తున్నవి ''నిజానికి విదేశాల్లోని చైనా పౌరలు కోసం ఏర్పాటు చేసిన సేవా కేంద్రాలు’’ అని చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ చెప్పారు. ఇతర దేశాల న్యాయ సార్వభౌమాధికారాన్ని చైనా పూర్తిగా గౌరవిస్తోందని పేర్కొన్నారు.
- ఒక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చైనా-అమెరికా-కెనడా సంబంధాలను ఎలా మార్చిందంటే..
- చైనా 'గూఢచారి' నౌక శ్రీలంక వెళుతోంది.. భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది?

అమెరికా సెనేట్ కమిటీ విచారణ
సేఫ్‌గార్డ్ డిఫెండర్స్ కృషి ఫలితంగా.. ఐర్లండ్‌లోని డబ్లిన్ నగరం నడిబొడ్డున గల ఒక చైనా 'పోలీస్ స్టేషన్’ను మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే.. కెనడా భూభాగం మీద చైనా అనధికారికంగా పోలీస్ స్టేషన్లు తెరిచిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని కెనడా ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల చెప్పారు.ఇలాంటి అనధికారిక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయటం సరికాదని, ఈ అంశంపై దర్యాప్తు చేసి చర్యలు చేపడతామని నెదర్లాండ్స్ స్పష్టం చేసింది. అమెరికా వ్యాప్తంగా చైనా సీక్రెట్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని చెప్తున్న నివేదికలను తాము పరిశీలిస్తున్నామని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టొఫర్ రే తాజాగా సెనేట్ సంఘానికి చెప్పారు. ''ఈ పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్న సంగతి మాకు తెలుసు’’ అని చెప్పిన ఆయన ఈ అంశంపై ఎఫ్‌బీఐ ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. సెనేట్ హోంలాండ్ సెక్యూరిటీ అండ్ గవర్నమెంటల్ అఫైర్స్ కమిటీ శుక్రవారం నిర్వహించిన విచారణలో ఎఫ్‌బీఐ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి మాట్లాడారు. కమిటీలోని సీనియర్ పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
- శాపోర్ మోయినియాన్: 'అవును... నేను అమెరికా సెక్యూరిటీ సీక్రెట్స్‌ను చైనాకు దొంగతనంగా పంపించాను'
- CIA: అమెరికా గూఢచార సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా భారతీయ అమెరికన్ నంద్ మూల్‌చందానీ

'జిన్‌పింగ్ విమర్శకులపై వేధింపులు, బ్లాక్‌మెయిల్’
''చైనా పోలీసులు (అమెరికాతో) సమన్వయం చేసుకోకుండా న్యూయార్క్‌లో దుకాణం తెరవటం సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తుంది. ప్రామాణిక న్యాయ, చట్ట అమలు సహకార పద్ధతులను కాలరాస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
ఈ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అమెరికా చట్టాన్ని ఉల్లంఘించటమేనా అని అడిగినపుడు.. న్యాయపరమైన విధివిధానాలను ఎఫ్‌బీఐ పరిశీలిస్తోందని రే బదులిచ్చారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మీద విమర్శలు చేసే అమెరికాలోని వ్యక్తులను చైనా ప్రభుత్వం వేధించటం, వెంటాడటం, నిఘా పెట్టటం, బ్లాక్‌మెయిల్ చేస్తోందనే ఆరోపణలపై అమెరికాలో పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు.
''ఈ సమస్య నిజంగా ఉంది. దీని గురించి మన విదేశీ భాగస్వాములతో కూడా మేం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది జరుగుతోంది మన దేశం ఒక్క చోట మాత్రమే కాదు’’ అని పేర్కొన్నారు.
అమెరికా నివాసి ఒకరిని, అతడి కుటుంబాన్ని వేధిస్తున్నారని, గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఏడుగురు చైనా జాతీయుల మీద అక్టోబర్ నెలలో అమెరికా కేసులు నమోదు చేసింది.
ఆ కుటుంబంలో ఒకరిని చైనాకు రప్పించటం కోసం చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందుకే వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
- నేను బైసెక్సువల్‌ని...నాలాంటి వారిపై ఎందుకు చిన్నచూపు?
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది?
- మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? దీనికి వైద్యులు చెబుతున్న కారణాలేంటి?
- వంటగది అపరిశుభ్రత వల్లే అనేక జబ్బులు... సాధారణంగా చేసే 9 తప్పులు, సరిదిద్దుకునే మార్గాలు
- భూమి మీది నీరంతా అంతరిక్షం నుంచి వచ్చిందేనా? ఇంగ్లండ్‌లో రాలిన ఉల్క దానికి సాక్ష్యమా?