చైనా బరితెగింపు
China cyberattack: డ్రాగన్ కంట్రీ చైనా దుశ్చర్యకు పాల్పడింది. ఏకంగా అగ్రరాజ్యం అమెరికా ఖజానాపై దృష్టి పెట్టింది. యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ను తన రాడార్ పరిధిలోకి తెచ్చుకుంది. కీలక సమాచారాన్ని సేకరించగలిగింది. అనేక డాక్యుమెంట్లకు సంబంధించిన యాక్సెస్‌ను పొందగలిగింది.
ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ విభాగం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌కు సెనెట్ బ్యాంకింగ్ కమిటీ ఓ లేఖను రాసింది. ఈ నెల తొలి వారంలో అంటే డిసెంబర్ 8వ తేదీన ఈ సైబర్ అటాక్ జరిగిందని వెల్లడించింది. ఈ సైబర్ అటాక్‌ను చైనా స్పాన్సర్ చేసిందని, అడ్వాన్స్డ్ పెర్సిస్టెంట్ థ్రెట్ (ఏపీటీ)తో ఈ దాడి జరిగిందనీ పేర్కొంది.

దీని వల్ల ఎంత మేర నష్టం వాటిల్లిందనేది అంచనా వేస్తోన్నామని తెలిపింది. ఈ సైబర్ అటాక్ ద్వారా చైనా ఎలాంటి సమాచారం గానీ, డాక్యుమెంట్లను పొందగలిగింది?, అవి- ఏఏ రంగాలకు సంబంధించినవి?, వాటి వల్ల భవిష్యత్తులో ఎలాంటి ముప్పు పొంచివుంది? అనే విషయాలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదీ లేఖలో సెనెట్ బ్యాంకింగ్ కమిటీ. వాటి గురించి ఆరా తీస్తోన్నామంటూ క్లుప్తంగా పేర్కొంది.
ఈ ఘటనపై ట్రెజరీ డిపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ సెక్రెటరీ ఆదితి హర్దీకర్ స్పందించారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను రూపొందించే పనిలో ఉన్నామని అన్నారు. ఈ సైబర్ అటాక్‌ను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని, అన్ని శాఖలను అప్రమత్తం చేశామని ఆదితి చెప్పారు.
లా ఎన్‌ఫోర్స్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ.. ఈ దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తును నిర్వహిస్తోన్నట్లు తెలిపారు. ఈ దాడి ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతమేర పడుతుందనేది ఆరా తీస్తోన్నామని వివరించారు. త్వరలోనే దీనిపై ఓ సమగ్ర నివేదికను రూపొందిస్తామని, దీన్ని హౌస్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిటీకి అందజేస్తామని ఆదితి హర్దీకర్ తెలిపారు.
దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్ని ట్రెజరీ డిపార్ట్‌మెంట్స్‌కు సంబంధించిన వర్క్ స్టేషన్లు ఈ దాడి వల్ల తీవ్రంగా ప్రభావితమైనట్లు అమెరికా మీడియా సీఎన్ఎన్ తెలిపింది. ఈ దాడిపై థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్ సర్వీస్ ప్రొవైడర్‌ను ఉటంకిస్తూ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బియాండ్ ట్రస్ట్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉంటోంది.












Click it and Unblock the Notifications