"అద్దెకు కూతురు కావాలి.. ఓ ప్లాట్, నెలకు రూ. 38 వేలు జీతం"
సాధారణంగా వృద్ధాప్యంలో ఎవరైనా తమ పిల్లల తోడు కోరుకుంటారు. వారికి వృద్ధాప్య, శారీరక సమస్యలు వస్తాయి కాబట్టి పిల్లల తోడు లేకుండా ఏ పనీ చేసుకోలేరు. అయితే పిల్లలు లేని ఒంటరి వృద్ధులు తమ బంధువుల తోడు కోరుకుంటారు. అయితే ఎవరూలేని ఒంటరిగా మారిన ఓ వృద్ధురాలు మాత్రం భిన్నమైన ప్రకటన ఇచ్చింది. తనకు కూతురిగా ఉంటే తనకున్న రెండు ప్లాట్స్ లో ఒకటి రాసిస్తానని.. అలాగే ప్రతి నెలా రూ. 38, 000 జీతం ఇస్తానని ఆఫర్ చేసింది. ఈ ప్రకటన కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ మలి వయసులో తనకు తోడు కోసం ఆ వృద్ధురాలు ఈ ప్రకటన చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
చైనాలోని ఓ వృద్ధురాలు కీలక ప్రకటన చేసింది. తనకు తోడుగా ఉండేందుకు ఓ కూతురు కావాలని ఆన్ లైన్ లో ప్రకటన చేసింది. అందుకుగానూ ఆ మహిళకు ఓ ప్లాట్ ఇస్తానని.. అలాగే ప్రతి నెలా రూ. 38,000 జీతం ఇస్తానని తెలిపింది. ఈ మేరకు నవంబర్ 19 ఓ టీవీ ప్రోగ్రామ్ ద్వారా కీలక ప్రకటన చేసింది. హెనాన్ ప్రావిన్స్ కు చెందిన 'మా' అనే వృద్ధురాలు ఈ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ యాడ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ వయసులో తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని.. 100 మీటర్లు కూడా నడవలేని పరిస్థితి ఉందని.. చైనాలోని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు ద్వారా స్పష్టం చేసింది. తనకు నిత్యావసరాలను అందించడం.. ఇంట్లో పని చేయడం.. అలాగే తనకు కబుర్లు చెప్పడం.. ఇలా తనను తల్లిలా చూసుకోవాలని ఆ యాడ్ లో స్పష్టం చేసింది. ఇందుకు గాను తనకున్న రెండు ప్లాట్లలో ఓ ప్లాటు ఇస్తానని అలాగే.. ప్రతి నెలా 3,000 యాన్ లు అంటే రూ. 38,000 జీతం అందిస్తానని పేర్కొంది. ఈ మేరకు కాంట్రాక్ట్ కూడా చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

మా.. సంవత్సరాల క్రితమే తన భర్తతో విడాకులు తీసుకుంది. ఇక తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నప్పటికీ ఓ కూతురు తనతో మనస్పర్థలు వచ్చి వెళ్లిపోయింది. అలాగే మరో కూతురు మానసిక పరిస్థితి బాగాలేక తనను చూసుకోవడం కష్టంగా ఉంది. అయితే ఆస్తుల విషయంలో తల్లి, పెద్ద కూతురు మధ్య వివాదం నడుస్తోందని హెనాన్ లా ఫర్మ్ నుంచి క్జీ జున్కీ అనే న్యాయవాది అన్నారు. ఎవరైతే మా కు కూతురిగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారో వాళ్లు లెగసీ సపోర్ట్ ఎగ్రీమెంట్ పై సంతకం చేయాలని సూచించారు. ఈ యాడ్ చైనాలో వైరల్ అవుతున్నక్రమంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరు అప్లై చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. మరికొందరు ఆసక్తి చూపించడం లేదు.












Click it and Unblock the Notifications