ఇన్సూరెన్స్ ఏజెంట్‌తో భర్త ఎఫైర్.. 14 కోట్ల దందా బయటపడింది!
ప్రేమ గుడ్డిది అంటారు.. కానీ ఆ ప్రేమ వెనుక లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయల సంపాదన తగలేస్తే ఎలా ఉంటుంది? చైనాలోని గువాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలి కోసం దాదాపు రూ.14 కోట్లు తగలేసిన ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. భార్యకు తెలియకుండా ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా నడిపిన ఈ ప్రేమాయణం.. చివరకు చిన్న ఇన్సూరెన్స్ పాలసీ కారణంతో వెలుగులోకి వచ్చి కోర్టు మెట్లెక్కింది.
చైనాలోని గువాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన జెన్ అనే మహిళకు 2017లోనే తన భర్త గువో తీరుపై తొలిసారి అనుమానం వచ్చింది. ఆయన ఫోన్‌లో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్‌తో జరిపిన మెసేజ్‌లు, చైనీస్ భాషలో 'ఐ లవ్ యూ' అనే అర్థం వచ్చేలా రూ. 520 చొప్పున పదే పదే పంపిన ఆన్‌లైన్ నగదు బదిలీల ఆధారాలు దొరికాయి. అయితే అప్పట్లో భర్త సర్దిచెప్పడంతో విషయాన్ని వదిలేసింది. కానీ 2024లో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, తన పేరుతో పాటు కుమార్తె పేరు మీద కూడా భర్త భారీగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో మళ్లీ పాత ఏజెంట్‌తోనే ఇదంతా జరుగుతోందని గ్రహించిన భార్య.... భర్త ఆర్థిక ఖాతాల తీగ లాగడం ప్రారంభించింది.

కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు.. 50 పాలసీలు!
భార్య జరిపిన విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. ఏజెంట్ మహిళకు భర్త గువో నేరుగా దాదాపు రూ. 3.6 కోట్లు నగదు రూపంలో బదిలీ చేసినట్లు గుర్తించింది. అంతేకాకుండా ఆ ఏజెంట్ ద్వారా ఏకంగా 50కి పైగా ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేసి, దానికి ప్రీమియంల రూపంలోనే రూ. 12 కోట్లకు పైగా చెల్లించినట్లు తేలింది. ఈ భారీ బిజినెస్ పుణ్యమా అని ఆ మహిళా ఏజెంట్ తన కంపెనీలో ఏకంగా మేనేజర్ హోదాకు ప్రమోట్ అయింది. పైగా వీరిద్దరూ కలసి వేర్వేరు ప్రాంతాల్లో 180 సార్లు హోటళ్లలో గడిపినట్లు పోలీసుల రికార్డుల్లో స్వయంగా భర్త అంగీకరించాడు.
కోర్టును ఆశ్రయించిన బాధితురాలు.. ఎదురుదాడి చేసిన ఏజెంట్
తన సంసారంలో నిప్పులు పోసి, సంపాదించిన ఆస్తిని పక్కదారి పట్టించారని భావించిన భార్య జెన్.. భర్త, ఏజెంట్, ఆ ఇన్సూరెన్స్ కంపెనీపై కోర్టులో కేసులు వేసింది. తన ఉమ్మడి కుటుంబ ఆస్తిని అక్రమంగా కాజేసినందున ఆ సొమ్మంతా తిరిగి ఇప్పించాలని కోరింది.
అయితే ఈ ఆరోపణలను ఏజెంట్ ఖండించింది. బిజినెస్ క్లయింట్లతో హోటళ్లలో సమావేశం కావడం నేరం కాదని, గువో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ప్రీమియంలు కట్టలేక తన భార్యతో కలిసి డ్రామాడుతున్నాడని ఎదురుదాడికి దిగింది. కానీ తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, 12కి పైగా సొంత ఆస్తులు ఉన్నాయని భర్త స్పష్టం చేస్తూ.. ఆ ఏజెంట్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్లే ఇన్ని పాలసీలు తీసుకున్నానని ఒప్పుకున్నాడు.
తీర్పు వెలువరించిన న్యాయస్థానం
సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు.. గువో, సదరు ఇన్సూరెన్స్ ఏజెంట్ మధ్య అక్రమ సంబంధం ఉందనే నిజాన్ని నిర్ధారించింది. అక్రమంగా బహుమతుల రూపంలో పొందిన రూ. 1.1 కోట్లను వడ్డీతో సహా భార్యకు తిరిగి చెల్లించాలని ఏజెంట్‌ను ఆదేశించింది. ఈ తీర్పుపై ఏజెంట్ చేసుకున్న రీ-ట్రయల్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.
ప్రస్తుతం ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన కాంట్రాక్ట్ వివాదంపై విచారణ కొనసాగుతుండగా, సోషల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించి వంద మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.














Click it and Unblock the Notifications
