ఇస్లామిక్ స్టేట్ పై యుద్ధం ప్రకటించిన ఆస్ట్రేలియా
సిరియా: సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి ఆస్ట్రేలియా సిద్ధం అయ్యింది. తొలిసారి సిరియాలోని ఉగ్రవాదులపై సమర శంఖం పూరించింది. మీ అంతు చూసేవరకు నిద్రపోమని ఆసిస్ హెచ్చరించింది.
ఆసిస్ యుద్ధ విమానాలు జరిపిన దాడిలో ఎంత ప్రాణనష్టం జరిగింది అనే విషయం కచ్చితంగా తెలియడం లేదని అధికారులు అంటున్నారు. అయితే దాడులు జరిపింది మాత్రం వాస్తవం అని ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి కెవిన్ ఆండ్రూస్ స్పష్టం చేశారు.
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉన్న తూర్పు సిరియా ప్రాంతంలో వైమానిక దాడులు చేశామని, మందుగుండ సామాగ్రి తరలిస్తున్న వాహనాలను ప్రత్యేక క్షిపణి ద్వారా ధ్వంసం చేశామని కెవిన్ ఆండ్రూస్ చెప్పారు.

సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం చోటు చేసుకోకుండా జాగ్రతలు తీసుకుంటున్నామని వివరించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ యుద్ధ విమానాలపై ఎదురు దాడులు చేసినా అవి ధ్వంసం కావని అన్నారు.
ఎలాంటి అగ్ని ప్రమాదానైనా తట్టుకునే శక్తి తమ జెట్ యుద్ధ విమానాలకు ఉందని కెవిన్ ఆండ్రూస్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను అణిచివేసే చర్యల కోసం అంతకుముందు జరిగిన ఒప్పందంతో పాటు సిరియాకు అన్ని విధాల సహకరించాలని ఈ దాడులు ప్రారంభించామని చెబుతున్నారు.
ఉత్తర బాగ్దాద్ లో ఇలాంటి దాడులు చేస్తామని ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి కెవిన్ ఆండ్రూస్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన అనేక మంది ఇస్లామిక్ స్టేట్ లో చేరిన విషయం తెలిసిందే. తొలిసారి ఆసిస్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగడంతో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు అలర్ట్ అయ్యారు.












Click it and Unblock the Notifications