చైనా, సౌత్ కొరియాలో కరోనా విలయం : వణికిపోతున్న జనం.. ఒక్కరోజులో 4లక్షలకుపైగా కొత్త కేసులు !!
కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాం.. అనుకుంటున్న తరుణంలో మరలా వైరస్ విరుచుకుపడుతోంది. చైనా, దక్షిణ కొరియాల్లో చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విజృంభిస్తోంది. ఆ దేశాల్లో నమోదవుతున్న కేసులు ఇప్పుడు ప్రపంచ దేశాలను మరోసారి కలవరపాటుకు గురిచేస్తోంది. మరలా మహమ్మారి వైరస్ వెంటాడుతోందని భయందోళన నెలకొంది. వైరస్ విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా స్పందించింది. కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ తిరగబడుతోందని హెచ్చరించింది.

సౌత్ కొరియాలో కరోనా విజృంభణ
దక్షిణ కొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. బుధవారం ఒక్కరోజు రికార్డు స్తాయిలో 4 లక్షల 714 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా కేసులు పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళలకు గురవుతున్నారు. సౌత్ కొరియాలో గత ఏడాది జనవరిలో తొలి కరోనా కేసు వెలుగు చూసింది. ఆ తర్వాత దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 293 మంది మరణించినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో సౌత్ కొరియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 76, 29, 275 లక్షలకు చేరినట్లు కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ వెల్లడించింది..

చైనాలో 13 నగరాల్లో లాక్‌డౌన్
మరోవైపు చైనాలోనూ కరోనా వైరస్ "స్టెల్త్ ఒమిక్రాన్" రూపంలో విజృంభిస్తోంది. గత రెండేళ్లగా కొత్త కేసులు ఒక్కటీ కూడా రాకూడదన్న వ్యూహంతో ఉన్న చైనాను ఈ వేరియంట్ గడగడలాడిస్తోంది. మంగళవారం అత్యధికంగా 5,280 కొత్త కేసులు నమోదయ్యాయి. సొమవారం కంటే రెట్టింపయ్యాయి. ఒక్కసారిగా కేసులు పెరగుతుండడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తం అయింది. మొత్తం 13 పెద్ద నగరాల్లో లాక్‌డౌన్ విధించింది. ప్రజా రవాణా వ్యవస్థను కూడా నిలిపివేసింది. సుమారు 3 కోట్ల మందికి పైగా ప్రజలు లాక్‌డౌన్‌లో ఉండిపోయారు. ఆంక్షలను కఠినతరం చేసింది.

నిబంధనలు పాటించని చోట కరోనా వ్యాప్తి..
కరోనా వైరస్ మరలా విజృంభిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రస్థాయిలోనే ఉందని వెల్లడించింది. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉంచాలని సూచించింది. కరోనా నిబంధనలు పాటించని చోట వైరస్ తిరగబడుతోందని డబ్యూహెచ్‌వో హెచ్చరించింది. కరోనా టెస్టులు, జీనోమ్ సీక్విన్సింగ్ లు, వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. కరోనా నిబంధనలు పాటించాలని సూచనలు చేసింది.












Click it and Unblock the Notifications