టీకాలతో వైరస్ సంపూర్ణంగా తొలిగిపోదు..బాంబు పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, పేద ప్రజలకు..!
జెనీవా: ప్రపంచదేశాల్లో కరోనావైరస్ విజృంభణ ఇంకా తగ్గలేదు. వ్యాక్సిన్‌లు వస్తున్నప్పటికీ అవి సున్నా కేసులు దిశగా మార్చలేవని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. జాగ్రత్తలు తీసుకోవడం కన్నా మరో మార్గం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్-జనరల్ టెడ్రాస్ అదానమ్ చెప్పారు. కరోనా పోరులో టీకాలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ... మహమ్మారిని సంపూర్ణంగా అంతం చేయలేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ నిపుణులు మైక్ ర్యాన్ చెప్పారు.

వ్యాక్సిన్‌తో కొంతవరకు మాత్రమే...
భవిష్యత్తుల్లో కొన్ని దేశాల్లో మరోసారి కరోనా మహమ్మారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని ర్యాన్ చెప్పారు. ఆ దేశ ప్రభుత్వాలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు ర్యాన్. వ్యాక్సిన్‌లు కరోనా కట్టడిని కొంత వరకు చేయగలవని అయితే మొత్తం కరోనావైరస్‌నే లేకుండా చేయలేవని ర్యాన్ పునరుద్ఘాటించారు. ఇక కరోనావైరస్‌పై వ్యాక్సిన్‌లు రావడం ఒక్కింత ఉపశమనం కలిగించాయని అదే సమయంలో కరోనావైరస్ కేసులు కూడా పెరుగుతున్నాయన్న సంగతిని మరవకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రాస్ అన్నారు. ఈ మహమ్మారి అంతమయ్యేందుకు చాలా సమయం ఉందని అదే సమయంలో ప్రభుత్వాలు, పౌరులు తీసుకునే జాగ్రత్తలను బట్టే కరోనావైరస్ పీడ తొలుగుతుందా లేదా అలానే కొనసాగుతుందా అనేది ఆధారపడి ఉంటుందని అన్నారు.

టీకాలు అందరికీ అందుబాటులోకి రావు
ఇదిలా ఉంటే టీకాలపై కూడా ర్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు సందర్భాల్లో వచ్చిన పలు వ్యాధులకు టీకాలు ఎంతో ఉపయుక్తంగా మారాయని చెప్పారు. ప్రపంచాన్ని పలు వ్యాధుల నుంచి ఈ టీకాలు విముక్తులను చేశాయని చెప్పిన ర్యాన్... కరోనావైరస్ విషయంలో కూడా ఇదే పాత్రను టీకాలు పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే... ఈ టీకాలు అందరికీ అందుబాటులోకి ఇప్పుడప్పుడే రావని చెప్పారు. అప్పటి వరకు ప్రజలు అత్యతం జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు. ముందుగా హెల్త్ వర్కర్లకు, వృద్ధులకు ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుందని ర్యాన్ చెప్పారు. దీంతో చాలా మంది బతికే అవకాశాలున్నాయని అయితే సంపూర్ణంగా ఈ వైరస్‌ను తొలగించలేదని చెప్పారు.

పేద ప్రజలకు వ్యాక్సిన్ అందుతుందా..
వ్యాక్సిన్‌లు వస్తే వాటికున్న ధరలను పేద ప్రజలు భరించలేరని అన్నారు టెడ్రాస్. వ్యాక్సిన్‌లు పొందే విషయంలో ప్రపంచంలోని పేద ప్రజలు వెనకబడే ఉంటారని స్పష్టం చేశారు. ముందుగా ధనికుల వద్దకే వ్యాక్సిన్ చేరుతుందని చెప్పారు. ఇది ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య కనుక... దీనికి పరిష్కారం కూడా సమపాళ్లలో జరగాలని అన్నారు టెడ్రాస్. వ్యాక్సిన్ పంపిణీలో పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం చూపితే మరో సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశాలున్నాయని టెడ్రాస్ జోస్యం చెప్పారు. అంతేకాదు ప్రపంచంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పిన టెడ్రాస్... పేదరికానికి టీకా లేదని, ఆకలికి టీకా లేదని, సమానత్వంకు టీకాలేదని, వాతవరణంలో చోటుచేసుకున్న వాటికి టీకా లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications