రష్యాలో ప్రమాదకర ప్లేగ్.. అవుట్ బ్రేక్: మధ్యయుగం నాటి మహమ్మారి: అమెరికా సైతం ఆరా
రష్యాలో అత్యంత ప్రమాదకర ప్లేగ్.. అవుట్ బ్రేక్ అయింది. భయానకంగా విస్తరిస్తోంది. ఓ మరణం సైతం సంభవించింది. వందలాదిమంది క్వారంటైన్ లోకి వెళ్లారు కూడా. ఈ సంఘటనతో ఉలిక్కిపడిందా దేశం. తక్షణ నివారణ చర్యలను తీసుకుంటోంది. అటు అమెరికా సైతం దీనిపై ఆరా తీస్తోంది. ప్లేగ్ అవుట్ వ్యాప్తి చెందిన ఉదంతంపై రష్యాతో సంప్రదింపులు జరుతున్నామని, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోన్నామని వైట్ హౌస్ వెల్లడించింది.
సైబీరియాలో గల ఓ రహస్య ప్లేగ్ రీసెర్చ్ ల్యాబ్‌లో అనుకోకుండా చోటుచేసుకున్న ప్రమాదం వల్ల ప్లేగ్ అవుట్ బ్రేక్ అయినట్లు రష్యా చెబుతోంది. ఇర్కుట్స్క్ యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తోన్న సైంటిస్ట్ డారియా షిపిలోవా దీని బారిన పడ్డారు. న్యుమోనియాతో హఠాత్తుగా మరణించారు. ఈ ల్యాబ్ నుంచి అత్యంత ప్రమాదకరమైన లైవ్ బ్యాక్టీరియా బయటకు వచ్చిందనే అనుమానాలతో వందలాది మందిని స్థానిక అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు.

ప్లేగ్ వ్యాప్తి చెందడానికి కారణం అయ్యే లైవ్ బ్యాక్టీరియా ఉన్న ల్యాబ్ టెస్ట్ ట్యూబ్‌ను ఆ సైంటిస్ట్ ప్రమాదవశాత్తూ పగలగొట్టినట్లు రీసెర్చ్ సెంటర్ ప్రాథమికంగా అంచనా వేసింది. మరణించడానికి కొద్ది గంటల ముందు ఈ విషయాన్ని డారియా స్వయంగా ఆసుపత్రి సిబ్బందికి వివరించినట్లు రష్యా మీడియా తెలిపింది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న ఆమె.. టెస్ట్ ట్యూబ్ పగిలిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. రెండు రోజుల్లోనే మరణించారు.
మంగోలియా సరిహద్దుకు ఆనుకుని ఉండే బురియాటియాలో ఉంటుందీ రీసెర్చ్ సెంటర్. దీంతో అటు మంగోలియా కూడా నివారణ చర్యలను తీసుకుంటోంది. ఆమె మరణం తరువాత రష్యా ప్రభుత్వం వేగంగా స్పందించింది. కాంటాక్ట్ ట్రేసింగ్‌ను ప్రారంభించింది. డారియాకు ట్రీట్మెంట్ అందించిన ఆసుపత్రిలో దాదాపు 200 మందిని క్వారంటైన్ చేసింది. ఈ రీజియన్ లోని ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది.
ఈ మరణానికి గల అసలు కారణం న్యుమోనిక్ ప్లేగ్ అని ప్రాథమికంగా నిర్ధారించిందక్కడి ప్రభుత్వం. ఎర్సినియా పెస్టిస్ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వల్ల ప్లేగ్ వ్యాధి సంభవించినట్లు తేల్చింది. మధ్య యుగంలో పలువురి ప్రాణాలను బలిగొన్న బ్లాక్ డెత్ మహమ్మారికి ఈ బ్యాక్టీరియానే కారణం. సాధారణంగా ప్లేగ్‌లో బుబోనిక్, న్యుమోనిక్, సెప్టిసిమిక్ అనే మూడు రూపాలు ఉంటాయి. వీటిలో శ్వాసకోశ వ్యవస్థపై నేరుగా దాడి చేసే న్యుమోనిక్ ప్లేగ్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. జ్వరం, శ్వాస ఆడకపోవడం, దగ్గు వంటి ప్రాథమిక లక్షణాలు ఇందులో కనిపిస్తాయి.
అదే ఇప్పుడు రష్యాలో అవుట్ బ్రేక్ అయినట్లు వార్తలొస్తోన్నాయి. ఈ నేపథ్యంలో మాస్కో హెల్త్ నిపుణులు రంగంలోకి దిగారు. శానిటేషన్ వింగ్ చీఫ్ డాక్టర్ అన్నా పోపోవా స్వయంగా ఉన్నతాధికారులతో కలిసి సైబీరియా చేరుకుని ఈ ల్యాబ్ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు.












Click it and Unblock the Notifications
