దేవయాని ఇష్యూ: అమెరికా పశ్చాత్తాపం, సిటీలో నిరసన
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత దౌత్యాధికారిణి దేవయాని కోబ్రాగడే అరెస్టు వ్యవహారంపై అమెరికా పశ్చాత్తాపం ప్రకటించింది. దేవయానికి అందరి ఎదుట సంకెళ్లు వేయడం, దుస్తులు విప్పించి తనిఖీలు చేయడం దుమారం రేపిన విషయం తెలిసిందే. దేవయాని అంశంపై భారత ప్రభుత్వం దెబ్బకు దెబ్బ అన్నట్లుగా వ్యవహరించింది.
దీంతో తగ్గిన అమెరికా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. అమెరికా స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ జాతీయ భద్రతాధికారి శివశంకర్ మీనన్‌తో మాట్లాడి పశ్చాత్తపం ప్రకటించారు. మరోవైపు కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ను జాన్ కెర్రీ కలువనున్నారు.

పనిమనిషి లేఖ విడుదల
దేవయాని పనిమనిషి సంగీత రిచర్డ్ లేఖ వెలుగులోకి వచ్చింది. తనను దేవయాని తనను, తన కుటుంబ సభ్యులు బాగా చూసుకున్నారని సంగీత లేఖలో ఉంది.
కాగా, దేవయాని పనిమనిషి సంగీత ఆచూకీ గురించి తమకేమీ తెలియదని అమెరికా చెబుతోంది. అయితే ఆ విషయం ఆ దేశ ప్రభుత్వానికి తెలుసనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంగీత అత్త భారత్‌లోని అమెరికా దౌత్యవేత్త వద్ద ఉద్యోగం చేశారనీ, సంగీత మా ఇప్పటికే ఇక్కడి అమెరికా ఎంబసిలో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
భర్త పిలిప్ అమెరికాకు టి వీసాపై వెళ్లడానికి ముందు మొజాంబిక్ రాయబార కార్యాలయంలో డ్రైవరుగా పని చేసినట్లు తెలుస్తోంది. దేవయాని అరెస్టు తర్వాత పిలిప్ భారత ప్రభుత్వానికి అందుబాటులో ఉండకూడదనే కుట్రతోనే అతడు కుటుంబాన్ని తరలించినట్లుగా అనుమానిస్తున్నారు.
భారత్ వ్యాప్తంగా పెల్లుబుకిన ఆగ్రహం
దేవయాని పట్ల అమెరికా తీరుపై భారత్ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకింది. పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. గురువారం సికింద్రాబాదులోని అమెరికా కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వామపక్షాల ఆధ్వర్యంలో కాన్సులేట్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.
ఐరాస కార్యాలయానికి దేవయాని
ఇదిలావుంటే, దేవయానిని ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత రాయబార కార్యాలయానికి తరలించారు. దీంతో ఆమెకు పూర్తిస్థాయిలో దౌత్యపరమైన రక్షణ లభిస్తుంది. అమెరికాలో దేవయానికి జరిగిన అవమానం అత్యంత గర్హనీయమైన చర్యగా అభివర్ణించిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఆమెను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని ప్రకటించిన వెంటనే ఈ తరలింపు జరిగింది.












Click it and Unblock the Notifications