దేవయాని ఇష్యూ: అమెరికా రెస్టారెంట్లకు బహిష్కరణ

వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో భారత దౌత్యకారిణి దేవయాని అంశం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం దేవయానిని అవమానకర రీతిలో అరెస్టు చేసిన అనంతరం ఆమె దుస్తులు విప్పించి తనిఖీలు చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా శుక్రవారం బాంద్రాలోని అమెరికన్ ఫుడ్ చైన్ డోమినోస్ పైన దాడి చేసింది. అనంతరం అమెరికా రెస్టారెంట్లను బైకాట్ చేయాలని పిలుపునిచ్చింది.
పరిష్కారం కనుగొంటాం: ఖుర్షీద్
దేవయాని వ్యవహారంలో పరిష్కారం కనుగొంటామని, భారత్ - అమెరికా మధ్య సంబంధాలనుకాపాడుకోవడం కూడా ముఖ్యమని కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. దేవయానిపై అభియోగాలు ఉపసంహరించుకోనున్న అమెరికాపై స్పందించేందుకు ఖుర్షీద్ నిరాకరించారు. ఆమె గౌరవాన్ని కాపాడుతామన్నారు.
సంగీతపై ఎఫ్ఐఆర్ మీద షిండే
దేవయాని పనిమనిషి సంగీతపై ఢిల్లీలో ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ మీద కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
వారిని అరెస్టు చేయాలి: యశ్వంత్ సిన్హా
అమెరికా క్షమాపణ చెప్పాలని బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. భారత్‌లో నిబంధనలకు విరుద్ధంగా చాలామంది ఉంటున్నారని, వారిని అరెస్టు చేయాలని సిన్హా అన్నారు.
క్షమాపణలు చెప్పాల్సిందే: కమల్ నాథ్
భారత దౌత్యాధికారిణి దేవయాని విషయంలో అమెరికా క్షమాపణలు చెప్పాల్సిందేనని, వారి చర్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్రమంత్రి కమల్ నాథ్ శుక్రవారం మరోసారి స్పష్టం చేశారు. తాను క్షమాపణలు తప్ప మరో దానిని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాగే దేవయాని పైన అమెరికా పెట్టిన కేసులను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు మారిపోయాయని, భారత్ కూడా మారిపోయిందన్నారు.
కోర్టు జోక్యం కోరిన దేవయాని తండ్రి
తన కూతురు దేవయాని ఘటనపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని ఆమె తండ్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు దేవయాని పని మనిషి సంగీత రిచర్డ్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నాయి. సంగీత, ఆమె భర్త పైన ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
క్షమాపణ చెప్పాల్సిందే: బిజెపి
దేవయాని పట్ల వైఖరికి అమెరికా క్షమాపణ చెప్పాల్సిందేనని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. ఏమైందనేది అనవసరమని కానీ, దేవయాని పట్ల వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని, దీనికి అమెరికా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.
క్షమాణపలకు అమెరికా నిరాకరణ
భారత దౌత్యాధికారిణి దేవయాని కోబ్రాగాడే ఇష్యూపై క్షమాపణలు చెప్పేందుకు అమెరికా నిరాకరించింది. దేవయాని ఇష్యూపై అమెరికా పశ్చాత్తాపం ప్రకటించి సరిపెడితే సరిపోదని, క్షమాపణలు చెప్పాల్సిందేనని భారత్ డిమాండ్ చేసింది. దీనిపై అమెరికా స్పందించింది.
తాము ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంటామని, ఆరోపణలపై తాము వెనక్కి తగ్గమని, న్యాయపరంగా వెళ్తామని పేర్కొంది. అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ అధికార ప్రతినిధి గురువారం ఈ అంశంపై స్పందిస్తూ.. తనకు ఫిర్యాదు గురించిన సమాచారం గానీ, విత్ డ్రాకు సంబంధించిన సమాచారం గానీ తెలియదన్నారు.
కాగా, దేవయాని పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరు పట్ల తీవ్ర మనస్తాపం చెందిన ప్రధాని మన్మోహన్ సింగ్, ఈ సమస్య విషయంలో ఏ కోణాన్ని వదలొద్దని, పూర్తిస్థాయి పరిష్కారం కనుగొనాలని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్‌లను ఆదేశించారు. బుధవారం రాత్రి అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్‌కు ఫోన్ చేసి దేవయాని పట్ల అధికారులు ప్రవర్తించిన తీరు పట్ల విచారం వ్యక్తం చేయడం తెలిసిందే.
కెర్రీ తనతో జరిపిన టెలిఫోన్ సంభాషణ వివరాలను తెలియజేయడం కోసం మీనన్ గురువారం ప్రధాని మన్మోహన్‌ను కలిశారు. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నిన్ననే ఇదే విషయమై మన్మోహన్‌ను కలిసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేవయాని పట్ల అమెరికా ప్రవర్తించిన తీరుపట్ల తీవ్ర మనస్తాపం చెందిన ప్రధాని ఈ వ్యవహారంలో ఏ కోణాన్నీ వదిలిపెట్టకుండా పూర్తిస్థాయి పరిష్కారాన్ని కనుగొనాలని వారిని ఆదేశించారని, అంటే ఆమె జైలునుంచి విడుదల కావడమే కాక ఆమెపై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చూడాలన్నదే ప్రధాని ఉద్దేశమని ఆ వర్గాలు తెలిపాయి.
మరోవైపు తమ న్యాయ వ్యవస్థలో అనుచిత జోక్యం వద్దని ప్రభుత్వం అమెరికాను గురువారం హెచ్చరించింది. ఈ కేసులో దేవయాని మాత్రమే బాధితురాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తూ, ఆమెపై తీసుకున్న చర్య వియన్నా ఒడంబడికకు వ్యతిరేకమని పేర్కొంది. దౌత్యవేత్త పట్ల అమెరికా అధికారుల ప్రవర్తనలో దయాదాక్షిణ్యాలు అనేవి మచ్చుకైనా లేవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. అమెరికా అటార్నీ మన్‌హట్టన్‌లో బుధవారం చేసిన ప్రకటనపై స్పందిస్తూ అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేవయాని తమ ఇంట్లో పనిమనిషి సునీతా రిచర్డ్‌పై గత ఏడాది న్యూఢిల్లీలో చీటింగ్ కేసు దాఖలు చేసారని, సునీత కుటుంబాన్ని అమెరికా దొంగతనంగా తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని విదేశాంగ శాఖ ప్రశ్నించింది. ‘భారత న్యాయ వ్యవస్థ కింద కేసులు పెండింగ్‌లో ఉండగా భారతీయ పౌరులను భారత దేశంనుంచి వేరే దేశం తరలించుకు పోవలసిన అవసరం ఏమొచ్చింది? మరో మైత్రీపూర్వక, ప్రజాస్వామిక దేశ న్యాయ ప్రక్రియలో ఈ విధంగా జోక్యం చేసుకున్నప్పుడు ఆ దేశ న్యాయ వ్యవస్థను ఎందుకు ప్రశ్నించకూడదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది' అని విదేశాంగ శాఖ ప్రకటన పేర్కొంది. ఈ కేసులో బాధితురాలు ఒకరే ఉన్నారని, అది దేవయాని మాత్రమేననే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications