దారుణం: భారత సంతతి క్రికెటర్ తల నరికివేత
జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశంలో ఉంటున్న భారత సంతతికి చెందిన మానసిక వికలాంగుడైన క్రికెటర్‌ను అతడికి సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులు తల నరికి నరబలి ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు అతడి ప్రాణస్నేహితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. భారత సంతతికి చెందిన నవాజ్ ఖాన్(23) అనే మానసిక వికలాంగ క్రికెటర్‌ను అతడి ప్రాణ స్నేహితుడు తండోవాఖే డుమా(21) తన ఇంటికి సమీపంలో ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లాడు. అతడు నాటువైద్యాలు చేస్తుంటాడు. ఆ అడవిలోనే నవాజ్ ఖాన్‌పై కత్తులతో దాడిచేసి తల నరికేశాడు.
తనకు కొన్ని సమస్యలున్నాయని, వాటి నుంచి బయటపడాలంటే మనిషి తల తీసుకురావాల్సిందిగా మరో భూత వైద్యుడు చెప్పాడని, అందుకే తాను స్నేహితుడిని బలిచ్చానని నిందితుడు డుమా పోలీసుల విచారణలో అంగీకరించాడు. అతడే ఘటనా స్థలాన్ని చూపించాడు. నిందితుడ్ని పట్టుకోవడంలో స్థానికులు చొరవ చూపారని పోలీసులు తెలిపారు.

ఖాన్‌ను చంపి, అతడి మొబైల్ ఫోన్లను తమ వద్ద ఉంచుకున్న మరో ఇద్దరిని కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. దక్షిణాఫ్రికాలో మానసిక వికలాంగ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2013 అవార్డును కూడా నవాజ్ ఖాన్ గెలుచుకున్నాడని అతడి తల్లి జకియా ఖాన్ చెప్పారు.
తాను ఎంతగానో అభిమానించే హషీమ్ ఆమ్లా నుంచి ఈ అవార్డు అందుకుని చాలా సంబరపడిపోయాడని, అది తన జీవితంలోనే అత్యంత మధుర క్షణమని చెప్పేవాడని ఆమె చెప్పారు.
కాగా, త్వరలో ఖాన్ తన బృందంతో విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, ఇంతలో ఈ దారుణం జరగడం విచారకరమని దక్షిణాఫ్రికా స్పోర్ట్స్ అసోసియేషన్ అధికార ప్రతినిధి అల్బర్ట్ వార్నిక్ తెలిపారు. ఖాన్ చాలా ప్రతిభగల బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ అని, అతడు చాలా మంది కొత్త ఆటగాళ్లకు మార్గదర్శకంగా ఉండేవాడని మాజీ జాతీయ క్రికెట్ కన్వీనర్ విన్‌స్టన్ స్టబ్స్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications