పంజాబ్, సింధ్ రాష్ట్రాల రద్దు? ముక్కలు కానున్న పాకిస్థాన్?
'విభజించు.. పాలించు' అనే సూత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తెల్లదొరల వ్యూహాన్ని పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇప్పుడు నూటికి నూరు శాతం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. దేశంలో ప్రధాని, రాష్ట్రపతి పీఠాలపై ఎవడు కూర్చున్నా అసలు అధికారం మాత్రం తన చేతిలోనే ఉంచుకున్న ఈ మిలిటరీ బాస్.. ఇప్పుడు ఏకంగా పాకిస్థాన్ భౌగోళిక రూపురేఖలనే మార్చేసేందుకు ఊహించని స్కెచ్ వేశారు. 1947లో దేశం ఏర్పడినప్పటి నుంచి ఉన్న నాలుగు ప్రధాన ప్రావిన్సులను రద్దు చేసి, వాటి స్థానంలో 12 నుంచి 160 వరకు చిన్న చిన్న ముక్కలుగా విభజించేందుకు పావులు కదుపుతున్నారు.
అసలు వ్యూహం ఏంటి? లాభం ఎవరికి?
పాకిస్థాన్‌లో అధికారాన్ని పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకోవడానికే మునీర్ ఈ పథకానికి తెరలేపారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రావిన్సులలో పంజాబ్ అత్యంత పెద్దదిగా ఉండి, దాదాపు 12.8 కోట్ల జనాభాతో సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తోంది. మరోవైపు బలూచిస్థాన్ కేవలం 1.5 కోట్ల జనాభాతో ఉంది. ఇంత పెద్ద రాష్ట్రాలను సరిగ్గా పాలించడం సాధ్యం కావడం లేదని, అందుకే చిన్న పరిపాలనా యూనిట్లుగా మారుస్తున్నామని సైన్యాధిపతి పైకి చెప్తున్నప్పటికీ.. అసలు ఉద్దేశం మాత్రం స్థానిక రాజకీయ శక్తుల వెన్ను విరిచి, తుది అధికారాన్ని మిలిటరీ నియమించే ప్రతినిధుల చేతుల్లో పెట్టడమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
పాక్ ఆర్థిక వ్యవస్థను ముంచెత్తింది ఎవరు?
పాకిస్థాన్ ఆర్థికంగా చితికిపోవడానికి, విపరీతమైన ద్రవ్యోల్బణంతో అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రావిన్సులు పెద్దవిగా ఉండటమే కారణమని మునీర్ సాకులు వెతుకుతున్నారు. కానీ అసలు విలన్ పాకిస్థాన్ సైన్యమేనన్నది జగమెరిగిన సత్యం.

దేశ పన్నుల రాబడిలో ఎక్కువ భాగాన్ని మింగేస్తూ, అత్యంత విలువైన భూములను ఆక్రమించుకుంటూ, వ్యాపారాలను సైతం తమ గుత్తాధిపత్యంలో ఉంచుకున్న మిలిటరీ వ్యవస్థే పాక్ వినాశనానికి కారణమైంది. భారత్‌తో నిరంతరం శత్రుత్వాన్ని పెంచి పోషిస్తూ తమ రక్షణ బడ్జెట్‌ను పెంచుకోవడమే తప్ప, దేశ సంక్షేమాన్ని సైన్యం ఎప్పుడూ పట్టించుకోలేదనే విమర్శలు బలంగా ఉన్నాయి.
రాజకీయ ప్రత్యర్థుల అణచివేత.. మిలిటరీ చేతిలోకి గద్దె
పాకిస్థాన్ రాజకీయంలో పంజాబ్, సింధ్ ప్రావిన్సులు ప్రధాన రాజకీయ పార్టీలైన పిఎంఎల్(ఎన్), పిపిపిలకు బలమైన కోటలుగా ఉన్నాయి. సైనిక ఏకఛత్రాధిపత్యానికి ఈ రాష్ట్రాలే కొంతవరకు అడ్డుకట్ట వేస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ బలాన్ని తుంగలో తొక్కి, ఆ పార్టీల నేతలను బొమ్మ ప్రధానిగా, రాష్ట్రపతిగా మార్చేసి మునీర్ చక్రం తిప్పుతున్నారు.
మరోవైపు అత్యంత ప్రజాదరణ పొందిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో బంధించి, ఆయన మద్దతుదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాలనే ముక్కలు చేసి, భవిష్యత్తులో మిలిటరీని ప్రశ్నించే శక్తే లేకుండా చేయాలనేది మునీర్ ప్లాన్. సాధారణ ప్రజల సౌకర్యం కోసం కాకుండా, కేవలం ఒక్క వ్యక్తి ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ విభజన పాకిస్థాన్ ఉనికికే ప్రమాదకరంగా మారే అవకాశముంది.














Click it and Unblock the Notifications
