భారత్ కు డెడ్ లైన్ ప్రకటించిన ట్రంప్- తర్వాత మీ ఇష్టం
India US Trade deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్ లపై మరోసారి తన వైఖరేమిటో వెల్లడించారు. టారిఫ్ పై గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. త్వరలోనే కొత్త టారిఫ్ అమలులోకి రాబోతోందనీ తెలిపారు. అనేక దేశాలపై కొత్తగా వడ్డించిన అదనపు వడ్డింపులకు డెడ్ లైన్ విధించారు.
వాణిజ్య భాగస్వామ్య దేశాలన్నీ కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త టారిఫ్ ను చెల్లించాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.ఈ మేరకు ఆయా దేశాలన్నింటికీ లేఖలు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ నాటికి లేఖల పంపిణీ పూర్తవుతుందని, ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వస్తుందని అన్నారు.

శుక్రవారం నాడు 10 నుంచి 12 దేశాలకు టారిఫ్ లేఖలు పంపిస్తామని ట్రంప్ తెలిపారు. మిగిలివి- ఈ నెల 9వ తేదీ నాటికి పంపిస్తామని, తమ దేశ వాణిజ్య, విదేశాంగ మంత్రిత్వ శాఖలు దీనిపై కసరత్తు పూర్తి చేసినట్లు చెప్పారు. తమతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఇది మొదటి గడువుగా అభివర్ణించారు.
అమెరికా విధించే కొత్త టారిఫ్ మెజారిటీ దేశాలకు 10 నుండి 20 శాతం వరకు ఉంటోంది. మరి కొన్ని దేశాలకు చాలా అధికంగా అంటే 60 లేదా 70 శాతం వరకు ఉండబోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో ట్రంప్ ప్రకటించిన 10 శాతం బేస్ లైన్ నుండి గరిష్టంగా 50 శాతానికి మించి ఈ సుంకాలు ఉండబోతోన్నాయి.
ఏఏ దేశాలకు ఎంత మేర టారిఫ్ ఉండబోతోంది?, ఏఏ వస్తువులపై అవి వర్తిస్తాయి? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. దీనిపై వాణిజ్య మంత్రిత్వ శాఖ కసరత్తు పూర్తి చేస్తోందని అన్నారు. ఈ నెల 9వ తేదీ తరువాత అంటే- లేఖల పంపిణీ పూర్తయిన తరువాత దీనిపై ఓ స్పష్టత వస్తుందని వివరించారు.
జూలై 9వ తేదీ గడువులోగా అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకోని దేశాలపై సుంకాలు గరిష్ఠంగా విధించే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని ముందు నుంచీ ట్రంప్ చెబుతూనే వస్తోన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన రెసిప్రోకల్ టారిఫ్ ను ప్రకటించిన ట్రంప్.. వాటిని అమలు చేయడానికి 90 రోజుల గడువు ఇచ్చారు. ఈ గడువు ఈ నెల 9వ తేదీ నాటికి ముగియబోతోంది.
ఇప్పటివరకు- ట్రంప్ అడ్మినిస్ట్రేషన్.. యూకే, వియత్నాంలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. భారత్ తో కూడా వాణిజ్య ఒప్పందం కుదరవచ్చని ట్రంప్ గతంలో ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 48 గంటల్లో భారత్-అమెరికా మధ్య ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications