రెండే నిమిషాల్లో ఆఫ్రీదిని బయటికి తెస్తా: ట్రంప్
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ గా మారిన అమెరికన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా పాకిస్తాన్ పై సంచలన కామెంట్స్ చేశారు. రహస్య ఆపరేషన్ ద్వారా పాక్ కు ఏ మాత్రం అనుమానం రాకుండా ఒసమా బిన్ లాడెన్ ను మట్టుపెట్టిన అమెరికాకు, ఆ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ కే చెందిన వైద్యుడు షకీల్ ఆఫ్రీది సహకరించిన విషయం తెలిసిందే. లాడెన్ ను అమెరికా హతం చేసిన తర్వాత రాజద్రోహం కింద ఆ వైద్యున్ని జైళ్లో పెట్టింది పాక్.
గత ఐదేళ్లుగా ఆఫ్రీది జైళ్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్న ట్రంప్ సోమవారం ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వివాదాస్పదంగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాను అమెరికా అధ్యక్షునిగా గనుక ఎన్నికైతే ఆఫ్రీదిని రెండంటే రెండు నిమిషాల్లో బయటికి తీసుకొస్తానని వ్యాఖ్యానించారు. పాక్ కు అమెరికా భారీ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నందువల్ల పాక్ తప్పకుండా తన ప్రతిపాదనకు ఓకె చెప్తుందని చెప్పుకొచ్చారు.

ట్రంప్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అలీఖాన్, ట్రంప్ చేసిన కామెంట్స్ ను ఖండించారు. డాక్టర్ ఆఫ్రీది తమ దేశ పౌరుడన్న విషయం గుర్తుంచుకోవాలని తెలిపిన అలీఖాన్.. ఆఫ్రీది తలరాతను నిర్ణయించేది పాకిస్తానే తప్ప డొనాల్డ్ ట్రంప్ కాదని తేల్చి చెప్పారు. అమెరికా ఇచ్చే చిల్లరకు ఆశపడి ఆ దేశం ఏం చెప్పినా పాక్ తలాడిస్తుందనుకోవడం ట్రంప్ పొరపాటన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఏళ్లుగా అమెరికాకి స్నేహ హస్తం అందిస్తున్న పాక్ గురించి ట్రంప్ కు అవగాహన లేదన్నారు అలీఖాన్.
ఇదంతా పక్కనబెడితే.. అప్పట్లొ పాక్ లోని ఆటోమాబాద్ లో లాడెన్ ఆచూకీని కనగొన్న అమెరికా నిఘా సంస్థ సీఐఏ కి డాక్గర్ షకీల్ ఆఫ్రీది రహస్య సహాయం అందించాడు. లాడెన్ ఇంట్లో ఉన్న పరిస్థితులను అంచనా వేయడానికి, వ్యాక్సిన్ సాకుతో ఆఫ్రీదిని లాడెన్ ఇంట్లోకి పంపించింది సీఐఏ. ఆఫ్రీది ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగించుకుని లాడెన్ ను హతం చేసింది. ఘటన తర్వాత ఆఫ్రీదిని దేశద్రోహం కింద అరెస్టు చేసి జైళ్లో పెట్టింది. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో షకీల్ వ్యవహారం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.












Click it and Unblock the Notifications