ముసలోడే కానీ ఇరగదీశాడు -ట్రంప్ డ్యాన్సింగ్ వీడియో వైరల్ -306 పక్కాగా వస్తాయట..
వయసు.. శరీరానికేగానీ ఉరకలెత్తే మనసుకు కాదనే సినిమా డైలాగ్ ను ఇంకాస్త ఆధునీకరించి.. తనవుకు కూడా ప్రాయం లేదనే తరహాలో.. తనదైన ప్రత్యేక స్టెప్పులతో ట్రంప్ తాతయ్య ఇరగదీశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మంగళవారం ఓటింగ్ డే కావడంతో ప్రజల్ని ఉత్సాహ పర్చేందుకు 'ఓట్.. ఓట్..' అంటూ డ్యాన్సుతో కూడిన ప్రత్యేక గీతాన్ని ఆయన షేర్ చేశారు.
VOTE! VOTE! VOTE!pic.twitter.com/85ySh1KYkh
— Donald J. Trump (@realDonaldTrump) November 3, 2020
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు ముందు రోజు రాత్రి దాకా ప్రచారం నిర్వహించిన ఆయన క్యాంపెయిన్ ముగియడానికి కొన్ని గంటల ముందు ట్విటర్ ఖాతా ద్వారా ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. VOTE! VOTE! VOTE! అనే క్యాప్షన్‌తో ఆ వీడియోలో హాలీవుడ్ పాటకు కాళ్లు కదుపుతూ కనిపించారు. డ్యాన్స్ చేస్తూ తన మద్దతుదారుల్లో మరింత ఉత్సాహం నింపారు. పోస్టు చేసిన కొద్ది సేపటికే ఆ వీడియో వైరల్ అయింది.

విస్కాన్సిస్ లో చివరి సభలో మాట్లాడుతూ ''మరో నాలుగేళ్ల కోసం.. ఇవాళే ఓటేయండి'' అని ట్రంప్ పిలుపునిచ్చారు. కాగా, ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ట్రంప్ విక్టరీ ప్రకటన చేస్తారంటూ వెలువడిన వార్త అమెరికాలో కలకలం రేపింది. అయితే, మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. సదరు వార్తను ఖండించారు.
ఎలక్షన్(పోలింగ్)డే నాడు వాషింగ్టన్ లో గడుపుతోన్న ట్రంప్.. పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తనకు 306 ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఆయనకు 304 ఎలక్టోరల్ ఓట్లు రావడం తెలిసిందే. 2020 ఎన్నికల్లో ట్రంప్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఓపీనియన్ పోల్స్ అన్నీ జోబైడెన్ కు అనుకూలంగా ఉన్నాయన్న వాదనను ప్రెసిడెంట్ తోసిపుచ్చారు.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. 50 రాష్ట్రాల్లోని అన్ని కౌంటీల్లో ఓటర్ల స్పందన గతంలో కంటే మెరుగ్గా ఉంది. అమెరికాలో మొత్తం 23.92 కోట్ల ఓటర్లకుగానూ ఇప్పటికే 10 కోట్ల మంది ముందస్తుగా ఓట్లేశారు. మంగళవారం సాయంత్రం పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ చేపడతారు. అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ ఫలితాలపై ప్రపంచమంతటా ఉత్కంఠ నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications