మెలానియా ట్రంప్ సంచలనం: తన పేరు మీద ఏకంగా.. !!
Donald Trump's swearing-in ceremony: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
భారత్‌లో ఈ కార్యక్రమం ఈ రాత్రి 10:30 గంటలకు ప్రారంభమౌతుంది. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు డొనాల్డ్ ట్రంప్. వచ్చే నాలుగేళ్లల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై మాట్లాడుతారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వాషింగ్టన్ మొత్తం జనసంద్రమైంది. గడ్డ కట్టించే చలిలోనూ కేపిటల్ వన్ ఎరినా వద్ద వేలాదిమంది అమెరికన్లు గుమికూడారు. ట్రంప్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తోన్నారు. అటు ఎరినా లోపల క్రిక్కిరిసిపోయింది. 20 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఇండోర్ వేదిక.. ప్రమాణ స్వీకారోత్సవానికి ముస్తాబైంది.
ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు మెలానియా ట్రంప్ సంచలనానికి తెర తీశారు. తన పేరు మీద సొంతంగా మీమ్ కాయిన్‌ను విడుదల చేశారు. క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో వినియోగించే కాయిన్ ఇది. దీని పేరు- $MELANIA. ఈ కాయిన్ క్రిప్టో మార్కెట్‌లో అందుబాటులో ఉందని ఆమె ప్రకటించారు.
దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సొలానా బ్లాక్‌చైన్ ప్లాట్‌ఫామ్.. ఈ కాయిన్‌ను రూపొందించింది. మార్కెట్ వేల్యూ, కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి వాణిజ్యపరమైన ట్రాకింగ్ మొత్తాన్ని కూడా ఆ సంస్థే పర్యవేక్షిస్తుంది. ఇది మార్కెట్‌లోకి లాంచ్ అయిన కొద్దిసేపటికే డొనాల్డ్ ట్రంప్ మీమ్ కాయిన్ క్రాష్ అయింది. దాని విలువ గణనీయంగా తగ్గింది.
క్రిప్టోకరెన్పీ మార్కెట్‌లో మీమ్ కాయిన్ చలామణిలో ఉంటుందనే విషయం తెలిసిందే. తమ సొంత పేర్ల మీద, ఇతర క్యారెక్టర్స్, ఆర్ట్ వర్క్, పెంపుడు జంతువులు, వణ్యప్రాణుల మీద మీమ్ కాయిన్‌ను క్రిప్టో మార్కెట్‌లో లాంచ్ చేయవచ్చు. ఇదివరకే డొనాల్డ్ ట్రంప్ కాయిన్ కూడా క్రిప్టో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.












Click it and Unblock the Notifications