మీ చేతుల్లో ఉక్రెయిన్: ట్రంప్‌కు పుతిన్ సందేశం
Donald Trump's swearing-in ceremony: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
భారత్‌లో ఈ కార్యక్రమం ఈ రాత్రి 10:30 గంటలకు ప్రారంభమౌతుంది. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు డొనాల్డ్ ట్రంప్. వచ్చే నాలుగేళ్లల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై మాట్లాడుతారు.

కొద్దిసేపటి కిందటే- వైట్ హౌస్ సమీపంలోని సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు డొనాల్డ్ ట్రంప్. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా ఇతర కుటుంబ సభ్యులు దీనికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి గౌరవార్థం జో బైడెన్, కమలా హ్యారిస్ ఇచ్చే తేనీటి విందుకు హాజరవుతారు. ఆ తరువాత కేపిటల్ వన్ ఎరీనాకు బయలుదేరి వెళ్తారు.
వాషింగ్టన్ మొత్తం జనసంద్రమైంది. గడ్డ కట్టించే చలిలోనూ కేపిటల్ వన్ ఎరినా వద్ద వేలాదిమంది అమెరికన్లు గుమికూడారు. ట్రంప్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తోన్నారు. అటు ఎరినా లోపల క్రిక్కిరిసిపోయింది. 20 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఇండోర్ వేదిక.. ప్రమాణ స్వీకారోత్సవానికి ముస్తాబైంది.
ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు ఆయనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలను తెలియజేశారు. ట్రంప్.. అమెరికా ప్రజల నమ్మకాన్ని చురగొన్నారని ప్రశంసించారు. ఆయనతో ముఖాముఖి భేటీ కావడానికి, చర్చలను కొనసాగించడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు.
ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన వ్యూహాలు అత్యంత సాహసోపేతమైనవని, ఫలితంగా స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించారని వ్లాదిమిర్ పుతిన్ కితాబిచ్చారు. ఓ నిజమైన హీరోలా పోరాడారని వ్యాఖ్యానించారు. రష్యాతో సత్సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తానంటూ ట్రంప్ చేసిన ప్రకటననూ ఈ సందర్బంగా పుతిన్ స్వాగతించారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా నిలిచారు జో బైడెన్. రష్యాను ధీటుగా ఎదుర్కొనడానికి ఉక్రెయిన్‌కు మిలియన్ డాలర్ల కొద్దీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అదే స్థాయిలో ఆయుధాలనూ అందజేశారు.












Click it and Unblock the Notifications