అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం.. : అదే హైలైట్
Donald Trump's swearing-in ceremony: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశానికి 47వ అధ్యక్షుడాయన. రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు.
ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. జేడీవాన్స్‌తో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బ్రెట్ కవనాఫ్ ప్రమాణం చేయించారు. అనంతరం అధ్యక్షుడి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు డొనాల్డ్ ట్రంప్. నాలుగు సంవత్సరాల తన ప్రభుత్వ హయాంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి వివరిస్తారు.

ప్రమాణ స్వీకారం పోడియానికి కుడివైపు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ ఆసీనులయ్యారు. ఎడమ వైపున జో బైడెన్, కమలా హ్యారిస్, స్పీకర్ న్యాన్సీ పెలోసీ కూర్చున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు న్యూయార్క ఆర్చ్ బిషప్ టిమోతి ఎం డోలన్.. ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో అందరూ లేచి నిల్చోవడం కనిపించింది.
ప్రేయర్ల అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమైంది. తొలుత ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయన భార్య ఉషా చిలుకూరి వాన్స్, పిల్లలు ఆయన పక్కనే నిల్చున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే హర్షధ్వానాలతో ఆ ప్రాంతం మొత్తం మార్మోగిపోయింది.
ఆ వెంటనే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం ఆరంభమైంది. రెండు నిమిషాల్లో ప్రమాణం ముగిసింది. ఆయన పక్కనే ఉన్న మెలానియా ట్రంప్, ఇవాంక ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్, కమలా హ్యారిస్ ఆయనను అభినందించారు. కొన్ని నిమిషాల పాటు చప్పటలతో ఆ ప్రదేశం మొత్తం ప్రతిధ్వనించింది. అనంతరం ట్రంప్ గన్ సెల్యూట్ అందుకున్నారు.












Click it and Unblock the Notifications