ఈ క్షణం నుంచే..: అధ్యక్షుడిగా ట్రంప్ తొలి సంచలన ప్రకటన
Donald Trump's swearing-in ceremony: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశానికి 47వ అధ్యక్షుడాయన. రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు.
ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. జేడీవాన్స్‌తో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బ్రెట్ కవనాఫ్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం పోడియానికి కుడివైపు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ ఆసీనులయ్యారు. ఎడమ వైపున జో బైడెన్, కమలా హ్యారిస్, స్పీకర్ న్యాన్సీ పెలోసీ కూర్చున్నారు.

ప్రమాణ స్వీకారానికి ముందు న్యూయార్క ఆర్చ్ బిషప్ టిమోతి ఎం డోలన్.. ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో అందరూ లేచి నిల్చోవడం కనిపించింది. ప్రేయర్ అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమైంది. తొలుత ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయన భార్య ఉషా చిలుకూరి వాన్స్, పిల్లలు ఆయన పక్కనే నిల్చున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే హర్షధ్వానాలతో ఆ ప్రాంతం మొత్తం మార్మోగిపోయింది.
ఆ వెంటనే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం ఆరంభమైంది. రెండు నిమిషాల్లో ప్రమాణం ముగిసింది. ఆయన పక్కనే ఉన్న మెలానియా ట్రంప్, ఇవాంక ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్, కమలా హ్యారిస్ ఆయనను అభినందించారు. కొన్ని నిమిషాల పాటు చప్పటలతో ఆ ప్రదేశం మొత్తం ప్రతిధ్వనించింది. అనంతరం ట్రంప్ గన్ సెల్యూట్ అందుకున్నారు.
కొంత స్వల్ప విరామం అనంతరం ట్రంప్ ప్రసంగించారు. ఈ క్షణం నుంచే అమెరికా స్వర్ణ యుగం ఆరంభమైందని ప్రకటించారు. ఈ దఫా జరిగిన అధ్యక్ష ఎన్నికలు తనపై గతంలో జరిగిన ద్రోహాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాయని అన్నారు. ప్రజలు తన పట్ల, తన నాయకత్వం పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించారని వ్యాఖ్యానించారు.
అమెరికా పతనానికి ఈ క్షణమే అడ్డుకట్ట పడిందని ట్రంప్ అన్నారు. దేశ ప్రజల స్వేచ్ఛ మళ్లీ వారికి లభించిందని, ఇకపై అమెరికన్లు ఎలాంటి తిరస్కరణకు గురి కాబోరని హామీ ఇచ్చారు. తన సారథ్యంలో దేశ సమగ్రత, విధేయత, సార్వభౌమాధికారం, భద్రత పునరుద్ధరణకు నోచుకుటుందని అన్నారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఆర్మీని మళ్లీ తీర్చిదిద్దుతానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యుద్ధాలను గెలవడం ద్వారా మాత్రమే కాదు.. వాటికి చరమగీతాన్ని పలుకుతామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడే గానీ యుద్ధ వాతావరణం తలెత్తనివ్వకుండా చూస్తానని పేర్కొన్నారు. దేశంలో రాడికల్ సిద్ధాంతాలతో కూడిన రాజకీయాన్ని అడ్డుకుంటానని, దీనికి సంబంధించిన ఉత్తర్వులపై తొలిసంతకం చేస్తానని అన్నారు ట్రంప్.












Click it and Unblock the Notifications