కోర్టులో లొంగిపోనున్న అమెరికా మాజీ అధ్యక్షుడు: కనీవినీ ఎరుగని భద్రత
వాషింగ్టన్: పోర్న్‌స్టార్ అక్రమ చెల్లింపుల వ్యవహారంలో అరెస్ట్‌ను ఎదుర్కొంటోన్న వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కోర్టులో లొంగిపోనున్నారు. తన అరెస్ట్ తప్పదంటూ ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. తనకు అండగా నిలవాలంటూ మద్దతుదారులకు పిలుపునిచ్చారు. నిరసన ప్రదర్శనలను చేయాలని సూచించారు. అక్రమ చెల్లింపుల కేసులో మన్‌హట్టన్ న్యాయస్థానం ఇవ్వాళ తీర్పు వెలువడించే అవకాశం ఉన్న నేపథ్యంలో- ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆయనపై ఉన్న ఆరోపణలు రుజువైతే అమెరికాలో ఒక మాజీ అధ్యక్షుడికి ప్రత్యక్ష ప్రమేయం ఉన్న తొలి క్రిమినల్ కేసు ఇదే అవుతుంది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఎన్నికల కంటే ముందే టాప్ అమెరికన్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ (Porn Star Stormy Danials)తో తనకు ఉన్న సంబంధాలు బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు. దీనికోసం తన తరఫు అడ్వొకేట్‌ను మధ్యవర్తిగా పెట్టి- ఆమెకు పెద్ద మొత్తం డబ్బులను చెల్లించారనేది ట్రంప్ ఉన్న ఆరోపణలు. ..

2006లో ట్రంప్ తనతో సెక్స్ చేశారని స్టార్మీ డేనియల్స్ ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాన్ని బయటపెట్టకుండా ఉండటానికి బెదిరించారని, తాను నోరెత్తకుండా ఉండటానికి 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ కేసును మన్‌హట్టన్ క్రిమినల్ కోర్టు విచారణ కొనసాగిస్తోంది. ఇవ్వాళ తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కేసులో కోర్టు తనను దోషిగా తేల్చిన వెంటనే లొంగిపోవాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు.
ఆయన కోర్టుకు హాజరు కానున్నందున న్యూయార్క్ పోలీసులు ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. మన్‌హట్టన్ న్యాయస్థానం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లను అమర్చారు. న్యాయస్థానానికి దారి తీసే మార్గాలన్నింటినీ మూసివేశారు. వీఐపీలు రాకపోకలు సాగించడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కోర్టుకు దారి తీసే మార్గాల్లో పెద్ద ఎత్తున సాయుధ పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి తలెత్తినా తక్షణమే స్పందించేలా చర్యలు చేపట్టారు.
అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తరువాత ఆయన అభిమానులు భారీ సంఖ్యలో అమెరికన్ క్యాపిటల్ బిల్డింగ్‌ను ముట్టడించిన విషయం తెలిసిందే. ట్రంప్‌కు అనుకూలంగా 2021 జనవరి 6వ తేదీన భారీ ర్యాలీని నిర్వహించిన అభిమానులు క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడి చేశారు. భద్రతను ఛేదించుకుని అందులో చొరబడ్డారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న న్యూయార్క్ పోలీసులు- మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలను తీసుకున్నారు.
డొనాల్డ్ ట్రంప్ ను పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందనేది చర్చనీయాంశమౌతోంది. ఆయన చేతికి సంకెళ్లు వేసి ఊరేగిస్తారనే ప్రచారం జరుగుతోంది. కెమరాల ముందు ఆయనను సంకెళ్లతో నడిపించే అవకాశం ఉందంటూ అమెరికన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అలాంటిదేమీ ఉండదని, ట్రంప్ కు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారని చెబుతున్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల కస్టడీలో ఆయన ఉంటారని స్పష్టం చేస్తోన్నారు. ఆయన అరెస్ట్ అయినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications