Donald Trump: కాల్పుల విరమణపై పుతిన్ ప్రకటన ఆశాజనకమే.. కానీ..!
Donald Trump: ఉక్రెయిన్‌లో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన చాలా ఆశాజనకంగా ఉందని.. కానీ అది అసంపూర్ణంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. 30 రోజుల కాల్పుల విరమణ ఆలోచనను తాను సమర్థిస్తున్నానని.. కానీ దాని గురించి కసరత్తు జరగాల్సిన అవసరం ఉందని పుతిన్ చెప్పిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంటే పుతిన్ అమెరికాతో చర్చించాలనే తన కోరికను ఆయన వ్యక్తం చేశారు.
"ఆయన(పుతిన్) చాలా ఆశాజనకమైన ప్రకటన చేశారు, కానీ అది పరిపూర్ణంగా లేదు" అని డొనాల్డ్ ట్రంప్ వైట్ హోస్ లో నాటో చీఫ్ మార్క్ రుట్టేతో జరిగినే సమావేశంలో పుతిన్ వ్యాఖ్యలు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. పుతిన్ ను కలవడానికి లేదా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వ్యాఖ్యానించారు. రష్యా శాంతి ప్రణాళికను తిరస్కరిస్తే అది ప్రపంచానికి తీవ్ర నిరాశను కలిగిస్తుందన్నారు. ఉక్రెయిన్ కాల్పుల విరమణపై చర్చలు జరపడానికి తన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్ కాఫ్ గురువారం మాస్కోకు చేరుకున్న సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించేందుకు అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన నిబంధనలపై చర్చలు జరగాలని, ఇది శాశ్వత శాంతికి మార్గం సుగమం చేయాలని పుతిన్ స్పష్టం చేశారు. మాస్కోలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ట్రంప్ ఆలోచన సరైనదేనని.. కచ్చితంగా మద్దతిస్తామన్నారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని మా అమెరికా మిత్రులు, ఇతర భాగస్వాములతో చర్చిస్తామన్నారు. ఒప్పందం ఉల్లంఘన కాకుండా సరైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. యుద్ధం ఆపాలన్న ప్రతిపాదనకు అంగీకరిస్తూనే.. సమస్య మూలాలను తొలగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్న అమెరికా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications