ఉక్రెయిన్‌లో స్కూల్‌పై బాంబులు: 60 మందికి పైగా దుర్మరణం
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఫిబ్రవరిలో ఆరంభమైన యుద్ధానికి అంతు ఉండట్లేదు. రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. ఈ దాడిలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గట్లేదు. సై అంటే సై అంటోన్నాయి. అటో ఇటో తేల్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తోన్నాయి. రష్యా సాగిస్తోన్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది..తిప్పి కొడుతోంది.
73 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. రాజధాని కీవ్‌ను చుట్టుముట్టినప్పటికీ.. అంత తేలిగ్గా లొంగట్లేదు. రాజధానిని కాపాడుకోవడంలో ఉక్రెయిన్ సైన్యం శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది.

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అందజేస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యా దూకుడును అడ్డుకుంటోంది ఉక్రెయిన్ సైన్యం. ఈ క్రమంలో రెండు వైపులా పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ పరిణామాల మధ్య రష్యా మరింత రెచ్చిపోతోంది. జనావాసాలను సైతం లెక్క చేయట్లేదు. పునరావాస భవనాలపైనా దాడులను సాగిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.
తాజాగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ఓ పాఠశాల భవనంపై రష్యా వైమానిక బలగాలు బాంబులను సంధించాయి. ఈ ఘటనలో 60 పలువురు దుర్మరణం పాలయ్యారు. అదే స్థాయిలో గాయపడ్డారు. ఈ దాడిలో కనీసం 60 మంది మరణించి ఉంటారని లుహాన్స్క్ రీజియన్ గవర్నర్ సెర్హీ హైదీ తెలిపారు. బిలొహోరివ్కాలో ఈ దాడి సంభవించినట్లు చెప్పారు. యుద్ధం ఆరంభమైన తరువాత ఈ స్కూల్ భవనాన్ని షెల్టర్‌జోన్‌గా మార్చిందక్కడి ప్రభుత్వం. 95 మంది వరకు స్థానికులు ఇక్కడ తలదాచుకుంటున్నారు.
ఈ భవన సముదాయంపై రష్యా వైమానిక బలగాలు బాంబులను సంధించినట్లు సైర్హీ హైదీ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలను చేపట్టామని 30 మందికి కాపాడగలిగామని అన్నారు. వారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. 60 మందికి పైగా మరణించి ఉండొచ్చని చెప్పారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. రష్యా అమానవీయంగా ఇలాంటి దాడులకు పాల్పడుతోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications