జపాన్ తీరంలో భారీ భూకంపం
జపాన్‌ను భూకంపం సంభవించింది. బోనిన్ ఐలాండ్స్ ను వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5గా రికార్డయింది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 7:39 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దాదాపుగా అదే సమయంలో వనువాటులోనూ భూమి ప్రకోపించింది. రెండు రోజుల్లో ఇక్కడ భూమి కంపించడం ఇది రెండోసారి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదైంది.
జపాన్ నైరుతి ప్రాంతంలో ఉంటుందీ బోనిన్ ఐలాండ్స్. ఒగసావారా ఐలాండ్స్ గా కూడా పిలుస్తారు దీన్ని. పసిఫిక్ మహాసముద్రంలో మూడు చిన్న ద్వీపాల సముదాయం ఇది. రాజధాని టోక్యోకు సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ద్వీప సముదాయానికి సమీపంలో పసిఫిక్ మహాసముద్ర గర్భంలో భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉపరితలం నుంచి 494 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్జీఎస్ తెలిపింది.

దీని తీవ్రత గణనీయంగా ఉన్నప్పటికీ ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. భూకంప కేంద్రం సముద్రంలో చాలా లోతున ఉండటం వల్ల తీర ప్రాంతాలపై దీని ప్రభావం తక్కువగా పడింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం నమోదైనట్లు సమాచారం అందలేదని స్థానిక అధికార యంత్రాంగం తెలిపింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు.
ఈ బొనిన్ ఐలాండ్ రీజియన్.. భౌగోళికంగా భూకంపాల తీవ్రత అధికంగా ఉండే సెస్మీక్ జోన్ పరిధిలో ఉంది. పసిఫిక్ మహాసముద్రం, ఫిలిప్పీన్ టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల మధ్య ఈ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సంభవించే ఘర్షణలు, కదలికల వల్లే తరచూ ఇక్కడ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. సముద్ర గర్భంలో ఏర్పడిన తీవ్ర ఒత్తిడి కారణంగానే భూమి అంతర్భాగంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని యూఎస్జీస్ వివరించింది.
అటు జపాన్ కూడా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉంటోందనే విషయం తెలిసిందే. నిరంతరం ఇటువంటి భూ ప్రకంపనల ముప్పును ఎదుర్కొంటూనే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక భూకంప నెట్‌వర్క్‌లో ఉన్నందున ప్రకంపనలు సర్వసాధారణం. మూడు లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో భూమి తరచూ ప్రకంపిస్తుంటుందక్కడ. జపాన్‌లో భూకంప తీవ్రతను లెక్కించడానికి షిండో స్కేల్‌ను ఉపయోగిస్తారు. నాలుగు లేదా అంతకంటే తక్కువ తీవ్రత ఉన్న భూకంపాలను తేలికపాటివిగా పరిగణిస్తారు. అయిదు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ప్రకంపనలు తీవ్రమైనవిగా భావిస్తారు.














Click it and Unblock the Notifications
