పసిఫిక్ మహాసముద్రం తీరంలో పెను భూకంపం
Russia Earthquake 2025: రష్యాలో భారీ భూకంపం సంభవించింది. అంచనాలకు అందని విధంగా భూమి ప్రకోపించింది. ఆ దేశాన్ని వణికించింది. అత్యంత శక్తిమంతమైన భూకంపం ఇది. దీని ప్రభావం జపాన్ పైనా పడిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొద్దిరోజుల కిందటే 8.8 తీవత్రతో సంభవించిన భూకంపంతో ఊగిపోయింది రష్యా. సునామీకీ కారణమైంది. జపాన్, అమెరికా, ఫిలిప్పీన్స్ సహా పలు పసిఫిక్ తీర ప్రాంత దేశాలు భయంకపితులయ్యాయి.
ఇప్పుడు తాజాగా అలాంటి పరిస్థితే ఏర్పడింది. రష్యా తీర ప్రాంతం కమ్‌చట్కాలో శనివారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తీవ్రత నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ తర్వాత దీన్ని ఉపసంహరించుకుంది పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్. అయినప్పటికీ సముద్రం అల్లకల్లోలంగా మారడం వల్ల తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బీచ్ లను తక్షణమే ఖాళీ చేయాలని సూచించింది.

కమ్‌చట్కా రీజియన్ రాజధాని పెట్రోపావ్లోవ్స్క్ నగరానికి తూర్పున 111 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. పసిఫిక్ మహా సముద్రానికి ఆనుకుని ఉంటుందీ ప్రాంతం. ఉపరితలం నుంచి 39.5 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్ లల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. మొదట 7.5 తీవ్రతగా రికార్డు చేసినప్పటికీ, తర్వాత దానిని 7.1కి తగ్గించింది.
పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే రీజియన్ ఇది. క్రియాశీలక అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. 20 నుంచి 25 వేల వరకు ప్రజలు నివసిస్తుంటారిక్కడ. డిస్ప్యూటెడ్ ఐలండ్స్ లల్లో ఇదీ ఒకటి. రష్యా, జపాన్ దీన్ని తమదిగా చెప్పుకొంటోన్నాయి. రష్యా సఖాలిన్ ప్రావిన్స్ ప్రభుత్వం తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తాజాగా భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని క్రెమ్లిన్ ప్రకటించింది. భూకంప తీవ్రత నేపథ్యంలో స్థానిక అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
లోతుగా సంభవించే భూకంపాల కంటే తక్కువ లోతు అంటే షాలో భూకంపాలు మరింత ప్రమాదకరమైనవిగా భావిస్తుంటారు. దీనికి కారణం.. లోతు తక్కువగా ఉండటం వల్ల భూకంపాల నుండి వచ్చే తరంగాలు భూమి ఉపరితలానికి వేగంగా చేరుకోవడమే. దీనివల్ల భూమి తీవ్రంగా కంపిస్తుంది. అలాంటప్పుడే కట్టడాలకు గణనీయంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఫలితంగా ప్రాణనష్టం సంభవిస్తుంటుంది. ఇప్పుడక్కడ ఏర్పడింది కూడా ఇలాంటిదే.












Click it and Unblock the Notifications