కూలీ పనులకు వెళ్తే కోటీశ్వరుడయ్యాడు.. 18 ఏళ్ల కుర్రాడి అదృష్టం!
సాధారణంగా డ్రెయినేజీ పైపులు వేసే క్రమంలో కాంక్రీట్ ముక్కలు, పాత సిమెంట్ పెచ్చులు మాత్రమే బయటపడతాయి. కానీ బెల్జియంలో పాత భవనం కింద పనులు చేస్తున్న కార్మికులకు నమ్మశక్యం కాని దృశ్యం కంటపడింది. పాత నేలమాళిగ గోడల మధ్య శతాబ్దాల నాటి దాచిన బంగారం వెలుగుచూసింది. ఏకంగా 49 పసిడి బిస్కెట్లు, వేలాది బంగారు నాణేలు పాత ఇటుకల వెనుక భద్రంగా దాచి ఉంచినట్లు గుర్తించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ దాదాపు 9 మిలియన్ యూరోలు, అంటే మన భారతీయ కరెన్సీలో రూ.99 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
డ్రెయినేజీ పనుల్లో వెలుగుచూసిన అదృష్టం
రాజధాని బ్రస్సెల్స్‌కు వాయువ్యంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింట్-గిల్లిస్-డెండర్‌మొండే గ్రామంలో ఈ అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో సమ్మర్ జాబ్ చేస్తూ డ్రెయినేజీ పైపుల కోసం తవ్వకాలు జరుపుతున్న 18 ఏళ్ల కోబే అనే విద్యార్థికి, అతడి తోటి కార్మికులకు భవనం పునాదులను తొలిచే క్రమంలో ఒక విచిత్రమైన గోడ కనిపించింది. పాత ఇటుకల వెనుక గోడలో ఏదో దాచి ఉంచినట్లు అనుమానం వచ్చి జాగ్రత్తగా తొలగించగా, పెద్ద బ్యాగుల్లో భద్రపరిచిన పసిడి రాశి బయటపడింది. ఆరంభంలో సాధారణ నాణేలుగా భావించినప్పటికీ, లోతుగా పరిశీలించగా పక్కాగా నంబర్లు ముద్రించి ఉన్న పసిడి బిస్కెట్లు, వేలాది విలువైన చారిత్రక నాణేలు బయటపడటంతో కార్మికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

శతాబ్దాల నాటి మద్యం వ్యాపారుల రహస్య కోట
ఈ నిధి వెలుగుచూసిన ప్రాంతానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 'బ్రూవర్స్‌హౌస్' అని పిలిచే ఈ భవనాన్ని 19వ శతాబ్దం చివర్లో థియోఫిలస్ వాన్ అస్చే అనే ధనిక మద్యం వ్యాపారి నిర్మించారు. 1899 నుంచి 1970 వరకు ఇక్కడ మద్యం తయారీ పరిశ్రమ విజయవంతంగా సాగింది. ఆ తర్వాత యాజమాన్యాలు మారుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ పాత భవనాన్ని 'సీఏడబ్ల్యూ ఓస్ట్-విలాండరెన్' అనే సామాజిక సంక్షేమ సంస్థ కొనుగోలు చేసి, తమ ఆఫీసులు, నివాసాల కోసం పునర్నిర్మిస్తోంది. బయటి గోడలను అలాగే ఉంచి, లోపలి భాగంలో జరుపుతున్న ఆధునీకీకరణ పనుల్లోనే ఈ నిధి బయటపడటం విశేషం. దశాబ్దాల తరబడి ఎవరి కంటా పడకుండా గోడల మధ్య నక్కిన ఈ పసిడి, వాన్ అస్చే కుటుంబానిదే అయి ఉంటుందని స్థానిక చరిత్రకారులు భావిస్తున్నారు.
న్యాయపరమైన చిక్కులు.. రూ.99 కోట్ల నిధి ఎవరిది?
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పసిడిని స్వాధీనం చేసుకుని బ్రస్సెల్స్‌లోని ప్రభుత్వ సురక్షిత భద్రతా కేంద్రానికి తరలించారు. ఈ బంగారం వెనుక ఏదైనా నేరపూరిత కోణం ఉందా, లేదా దొంగిలించబడిన సొత్తా అనే కోణంలో ఈస్ట్ ఫ్లాండర్స్ ప్రాసిక్యూటర్ కార్యాలయం విచారణ జరుపుతోంది. మరోవైపు, ఈ నిధిపై హక్కుల కోసం పోటీ తీవ్రమవుతోంది. అస్చే కుటుంబ వారసులు ఒకవేళ సరైన ఆధారాలు చూపిస్తే వారికి దక్కే అవకాశం ఉంది. అలాగే బెల్జియం చట్టాల ప్రకారం భవన ప్రస్తుత యాజమాన్యం, నిధిని కనుగొన్న కార్మికులు కూడా వాటా కోరవచ్చు. ఈ న్యాయ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు ఐదేళ్ల సమయం పట్టవచ్చని చట్ట నిపుణులు చెబుతున్నారు.
కోటీశ్వరుడిగా మారనున్న కుర్రాడు?
ఒక సాధారణ డ్రెయినేజీ గుంత తవ్వడానికి వచ్చి ఏకంగా కోట్లాది రూపాయల నిధిని కనుగొన్న కోబే అనే విద్యార్థి కథ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. కార్మికులు నిధిని దాచుకోకుండా నిజాయితీగా పోలీసులకు అప్పగించడంతో వారికి పెద్ద మొత్తంలో బహుమతి లేదా చట్టబద్ధమైన వాటా దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ 2031 నాటికి ఈ నిధికి అసలైన యజమానులు ఎవరూ లేరని తేలితే, చట్టప్రకారం ఆ ఆస్తిని భవన యజమానికి, కనుగొన్న కార్మికుడికి సగం సగం పంచి ఇచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే, రోజువారీ కూలీగా పనికి వచ్చిన ఆ కుర్రాడి జీవితం ఒక్కసారిగా కోటీశ్వరుడిగా మారిపోనుంది.














Click it and Unblock the Notifications
