అందరికీ షాకులిచ్చే ట్రంప్ కే బిగ్ షాకిచ్చాడు..!!
Donald Trump: అపర కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలగినట్లు ప్రకటించాడు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (DOGE) చీఫ్ హోదాకు గుడ్ బై చెప్పారు.
ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు ఎలాన్ మస్క్. ఓ ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన కాల పరిమితి ముగిసిపోయే సమయం వచ్చిందని వెల్లడించారు. డోజ్ చీఫ్ గా తనకు అవకాశం కల్పించినందుకు, దుబారా వ్యయాన్ని తగ్గించుకుంటోన్నందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కృతజ్ఞతలు చెప్పారు. అమెరికన్ల జీవన శైలిలో డోజ్ ఓ భాగమైందని, ఇక క్రమంగా అది మరింత బలోపేతమౌతుందని వ్యాఖ్యానించారు.

డోజ్ చీఫ్ గా, ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలను స్వీకరించిన అతి కొద్ది రోజుల్లోనే ఎలాన్ మస్క్.. ఈ హోదా నుంచి తప్పుకోవడం ప్రాధాన్యతను సంతరంచుకుంది. తన హయాంలో అనవసర, దుబారా వ్యయాలను అరికట్టడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కాంట్రాక్టులపై ప్రత్యేకంగా నిఘా ఉంచారు.
ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ పదవీ విరమణ ప్రక్రియను డిజిటలైజ్డ్ చేయగలిగారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఐటీ వ్యవస్థలకు సరికొత్త రూపాన్ని కల్పించారు. దీనివల్ల 160 బిలియన్ డాలర్ల దుబారాను అరికట్టారు ఎలాన్ మస్క్. అలాగే- 269 ప్రభుత్వ కాంట్రాక్టులను పునఃసమీక్షించారు. వీటిల్లో అనవసర కాంట్రాక్టులను రద్దు చేశారు. వీటి విలువ 255 మిలియన్ డాలర్లు.
అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన ఎలాన్ మస్క్‌కు డొనాల్డ్ ట్రంప్.. ప్రారంభంలోనే డోజ్ చీఫ్ గా అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన కోసమే కొత్తగా డోజ్ ను ఏర్పాటు చేశారు. దీనికి ఎలాన్ మస్క్ సారథ్యాన్ని వహిస్తారని ప్రమాణ స్వీకారం ప్రసంగంలోనే ప్రకటించారు.
కొత్త ప్రభుత్వంలో అనేక విప్లవాత్మక మార్పులను చూస్తారని హామీ ఇచ్చారు. అమెరికన్ల జైత్రయాత్ర ఇక్కడి నుంచే ఆరంభమైందని, మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే నినాదానికి వాస్తవ రూపాన్ని ఇస్తామని పేర్కొన్నారు. శతాబ్దాల పాటు చరిత్రలో నిలిచిపోయేలా గణనీయమైన మార్పులు తీసుకొస్తామని అన్నారు. డోజ్ పని తీరును గాడిలో పెట్టిన తరువాత తప్పుకొంటోన్నట్లు వెల్లడించారు మస్క్.












Click it and Unblock the Notifications