వ్యతిరేకత, నిరసన: ‘హిందూ మీల్స్’పై వెనక్కి తగ్గిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్
Recommended Video
న్యూఢిల్లీ: దుబాయ్ కేంద్రంగా నడిచే విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన అధికారిక మెనూ నుంచి 'హిందూ మీల్స్'ను తొలగించాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గింది. సోషల్ మీడియా యూజర్ల నుంచి పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తమవడంతో, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ఎమిరేట్స్ తెలిపింది.
ఎమిరేట్స్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత
ఫుడ్ ఆప్షన్స్ నుంచి ‘హిందూ మీల్స్'ను వెనక్కి తీసుకోవాలని, భారతీయుల మత సంబంధమైన విశ్వాసాలకు అనుగుణంగా శాకాహారం, మాంసాహారం ఆఫర్ చేయనున్నట్టు ఎమిరేట్స్ ఈ వారం ప్రారంభంలో ప్రకటించింది. కానీ ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
హిందూ మీల్స్ కొనసాగిస్తామంటూ..
తమ కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకుని, హిందూ మీల్ ఆప్షన్‌ను కొనసాగించనున్నామని ఎమిరేట్స్ తాజాగా ధృవీకరించింది. దీంతో తమ హిందూ కస్టమర్లను తేలికగా గుర్తించవచ్చని, వారి అభ్యర్థనమేరకు దీన్ని కొనసాగిస్తున్నామని ఎమిరేట్స్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటన వెలువరించింది.
కస్టమర్ల అభిరుచి మేరకు
ఎమిరేట్స్ ఎన్నో రకాల ప్రత్యేక భోజనాలను కస్టమర్లకు ఆఫర్ చేస్తుందని, వారిలో తమ హిందూ కస్టమర్లు కూడా ఉంటారని తెలిపింది. ప్రయాణికులకు తాము కల్పించే సేవలు గురించి నిరంతరం పరిశీలిస్తూ ఉంటామని, వారి అభిరుచికి తగినట్లుగా వ్యవహరిస్తామని పేర్కొంది.
ఎమిరేట్స్ సంస్థ వివరణ
‘ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా మా విమానయాన సంస్థలో ఆహారాన్ని, డ్రింక్స్‌ను అందిస్తాం. మా దగ్గర చాలా మంచి చెఫ్‌లు ఉన్నారు. వారు ప్రయాణికుల అభిరుచులకనుగుణంగా, మా సాంప్రదాయలను ప్రతిబింబించే రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. మేము ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పదార్ధాలను తయారు చేయిస్తాం' అని ఎమిరేట్స్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ ప్రయాణికులను దృష్టి ఉంచుకుని వారికి సౌకర్యంగా ఉండే వంటకాలను సిద్ధం చేస్తుంటాయి. వాటికి పలు మతాల పేర్లు కూడా పెట్టి తొందరగా గుర్తించేలా రూపొందిస్తున్నాయి.