Covishield: యూరప్ లిస్ట్ నుంచి అవుట్: గ్రీన్ పాస్ దొరకదిక: సీరమ్ ఏం చేస్తుందో?
లండన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు యూరోపియన్ యూనియన్ బిగ్ షాకిచ్చింది. భారత్‌లో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌లో మెజారిటీ వాటాగా వినియోగిస్తోన్న వ్యాక్సిన్ ఇది. కొత్తగా రూపొందించిన గ్రీన్ పాస్ లిస్ట్ నుంచి కోవిషీల్డ్‌ను యూరోపియన్ యూనియన్ కంట్రీస్ తొలగించాయి. అంటే- యూరప్ దేశాలకు వెళ్లదలిచిన వారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకుంటే.. అనుమతి లభించదు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చిన తరువాత కూడా యూరప్ కంట్రీస్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి- ఇప్పటిదాకా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే ఈ నిషేధం ఉండేది. దీన్ని యూరప్ దేశాలు కోవిషీల్డ్‌కు కూడా వర్తింపజేశాయి. యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం ఉన్న పలు దేశాలు కొత్తగా గ్రీన్ పాస్‌ను జారీ చేయడానికి అవసరమైన జాబితాను తయారు చేశాయి.

ఈ గ్రీన్ పాస్ లిస్ట్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీనితోపాటు- ఈయూ సభ్య దేశాలు డిజిటల్ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌ను కూడా అందుబాటులోకి తీసుకుని రానున్నాయి. ఈ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ వల్ల యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లో స్వేచ్ఛగా విహరించడానికి వీలు ఉంటుంది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ నాలుగు వ్యాక్సిన్లకు మాత్రమే ఇదివరకు అనుమతి ఇచ్చింది. ఫైజర్ అభివృద్ధి చేసిన కొమిర్నాటి, మోడెర్నా, ఆస్ట్రాజెనెకాకు చెందిన వ్యాక్స్‌జెర్విరియా, జాన్సన్ అండ్ జాన్సన్ కనిపెట్టిన జాన్‌స్సెన్ వ్యాక్సిన్లకు అక్కడ అనుమతి ఉంది.
ఈయూ సభ్యదేశాలు తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తోన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం స్పందించింది. దీన్ని పరిష్కరించడానికి చొరవ తీసుకుంటానని సీరమ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదార్ పూనావాలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఇందులో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికోసం తాము యూరోపియన్ యూనియన్‌తో సంప్రదింపులను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. డిజిటల్ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ లిస్ట్‌లో దీన్ని చేర్చాల్సిందిగా కోరతానని అన్నారు.












Click it and Unblock the Notifications