Putin-Kim :కిమ్ మామకు పుతిన్ బాబాయ్ ఊహించని రిటర్న్ గిఫ్ట్..(Video)
Putin gift to Kim:రష్యా ఉక్రెయిన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. దీనికి తోడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రష్యాకు సహాయం చేసేందుకు తన సైనికులను పంపారు. దీంతో రష్యా-ఉత్తరకొరియాల స్నేహ బంధం మరింత బలపేతం అయ్యింది. రష్యాకు ఉత్తరకొరియా అధ్యక్షుడు సైనికులను పంపడంతో మేము మాత్రం తక్కువ తిన్నామా ఏంటి అనుకున్నాడేమో ఏమో తెలియదుగానీ ఎవరూ ఊహించని గిఫ్ట్ ఉత్తరకొరియా అధ్యక్షుడికి పంపాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటనుకుంటున్నారా...?
రష్యా ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు పూర్తయినప్పటికీ అప్పుడప్పుడు ఇరు దేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. అయితే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు రష్యాకు అండగా నిలుస్తుండగా మరికొన్ని దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతునిస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు మనకెందుకులే అంటూ తటస్థంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పుడూ అణుపరీక్షలు, అణుక్షిపణులు ప్రయోగించి అగ్రరాజ్యాలకు నిద్ర లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా రష్యాకు అండగా నిలుస్తోంది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న పోరులో రష్యాకు తమ దేశ సైనికులను రష్యాకు పంపారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. కిమ్ జాంగ్ ఉన్ ఉండేది జానడే అయినా.. అగ్రరాజ్యాలకు చెమటలు పట్టించగల సత్తా ఉన్న నాయకుడు.

కిమ్‌కు పుతిన్ ఊహించని గిఫ్ట్
ఇక రష్యా సైన్యంలో చేరిన ఉత్తరకొరియా సైనికులు ఉక్రెయిన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.వాస్తవానికి ఉత్తరకొరియాపై అంతర్జాతీయంగా ఆంక్షలు ఉండటంతో ఆ దేశానికి చాలా అవసరాలున్నాయి.ఉదాహరణకు ఆర్థిక సాయం,చమురు, ఆధునిక ఆయుధాలు తయారీలో నైపుణ్యత ఇలాంటివి చాలా ఉన్నాయి. కిమ్ జాంగ్ ఉన్ రష్యాకు చేసిన ఈ ఉపకారానికి అనుకుంటే రష్యా అధ్యక్షుడు అవన్నీ సమకూర్చగలడు. కానీ ఎవరూ ఊహించని రిటర్న్ గిఫ్ట్ కిమ్ మామకు పంపాడు.
⚫ Russian President Putin gifted 70 animals, including an African lion and two bears, to a zoo in North Korea. pic.twitter.com/K7iqRDXaYT
— Journalite (@journaIite) November 20, 2024
కిమ్ జాంగ్ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు 70 జంతువులను బహుమతిగా పంపారు. అందులో రెండు ఎలుగుబంట్లు, రెండు యాక్(జడల బర్రె),ఆఫ్రికా జాతి సింహం కూడా ఉన్నాయి. వీటితో పాటు మరో 40 రకాల జంతువులను మాస్కో నుంచి ప్యాంగాంగ్‌కు రష్యా రవాణా చేసింది. ఉత్తర కొరియా ప్రజలకు రష్యా నుంచి అతి ప్రియమైన కానుక పంపుతున్నామని రష్యా సహజ వనరులు మరియు పర్యావరణ శాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ బహుమతితో రెండు దేశాల మధ్య బంధం బలోపేతం అవుతుందన్న సంకేతాలను ప్రపంచ దేశాలకు వెళ్లాయి. ఇప్పటికే రష్యాలోని కుర్స్‌క్ ప్రాంతంలో 10వేల మంది ఉత్తరకొరియా సైనికులు మోహరించి ఉన్నారు. ఈ ఏడాది ఆగష్టు నుంచి మళ్లీ రష్యా ఉక్రెయిన్‌ల మధ్య అడపాదడపా యుద్ధవాతావరణం కనిపిస్తూనే ఉంది.

సంక్షోభంలో ఉత్తరకొరియా
కిమ్ జాంగ్ ఉన్ పాలనలో ఉత్తరకొరియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రపంచ దేశాల ఆంక్షలు ఉత్తరకొరియాపై ఉండటంతో సహాయనిరాకరణ నెలకొంది. ఇక కోవిడ్ సమయంలో అయితే ఉత్తరకొరియా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గత కొన్నేళ్లుగా ఆ దేశాన్ని వరదలు ముంచెత్తడంతో అక్కడి పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు బతికేందుకు కష్టంగా మారింది. ఇప్పుడు ఉత్తరకొరియాకు ఆర్థిక సాయంతో పాటు కనీస వస్తువులు చాలా అవసరంగా మారాయి.
పుతిన్‌కు కిమ్ జాంగ్ ఉన్ సైన్యం పంపడంతో రిటర్న్ గిఫ్ట్ కింద ఉత్తరకొరియాకు ఆయుధాలు పంపుతారేమో అని అంతా ఆశపడి భంగపడ్డారు.ఒకవేళ అవే పంపితే దక్షిణ కొరియాకు, అమెరికాకు ముప్పు తప్పదేమో అనే ఆందోళన వ్యక్తమైంది.ఖండాంతర క్షిపణి తయారీ కిమ్ అజెండాగా ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే రష్యా ఆయుధాలను సప్లయ్ ఆలోచన ఉందా లేదా అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు.అంతకుముందు జూన్ నెలలో ఉత్తరకొరియా పర్యటనకు వచ్చిన రష్యా అధినేత పుతిన్‌కు కిమ్ రెండు ఉత్తరకొరియా జాతి కుక్కలను బహూకరించినట్లు ఆ దేశ అధికారిక మీడియా ఫోటోలను విడుదల చేసింది.

డ్రాగన్ కంట్రీ పాలసీ కూడా...
ఇలా జంతువులను బహుమతిగా పంపండం ద్వారా రెండు దేశాల మధ్య రాజకీయ బంధం, స్నేహ బంధం బలపడుతాయనే విశ్లేషణ ఉంది. ఈ నేపథ్యంలోనే చైనా... ఫిన్‌లాండ్, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు కొన్ని దశాబ్దాలుగా పండాలను కానుకగా పంపుతోంది.గత అక్టోబర్ నెలలో రెండు పాండాలు వాషింగ్టన్‌కు చైనా కానుకగా ఇవ్వగా... 1965 నుంచి ఉత్తరకొరియాకు చాలా సార్లు పాండాలను డ్రాగన్ కంట్రీ గిఫ్ట్‌గా ఇచ్చింది.ఇక స్నేహబంధంలో భాగంగా కిమ్ జాంగ్ ఉన్ కూడా జంతువులను కానుకగా ఇచ్చేవారు.2018లో ఉత్తరకొరియాలో జరిగిన ఓ సమావేశానికి అప్పటి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు కుక్కలను మూన్ జే ఇన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు కిమ్.ఆ చర్చల తర్వాత రెండు దేశాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి.












Click it and Unblock the Notifications